5ఏళ్ల‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు, ఐటీఐ నిపుణుల‌పై బాష్‌ కీల‌క ప్ర‌క‌ట‌న!

4 Feb, 2022 09:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆటోమోటివ్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ తయారీ కంపెనీ బాష్‌ చైర్మన్‌ డాక్టర్‌ స్టెఫాన్‌ హటుంగ్‌ తెలిపారు. ఈ నిధులను స్థానికంగానే తయారీ చేపడతామని, ఐటీఐలతో కలిసి యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు తగిన శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు. డిజిటల్‌ మొబిలిటీ రంగంలో పెట్టే రూ.వెయ్యికోట్లకు ఇది అదనమని ఆయన అన్నారు. భారత్‌లో బాష్‌ సంస్థ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా గురువారం ఏర్పాటైన వర్చువల్‌ విలేకరుల సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ జర్మన్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి భారతీయ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ తోడు కావడంతోనే బాష్‌ ఇండియా ద్వారా పలు రంగాల్లో వినూత్నమైన ఉత్పత్తులను అందించడం సాధ్యమైందని చెప్పారు. 

ఎనిమిది రాష్ట్రాలకు విస్తరణ...
1922లో కోల్‌కతాలో మొదలైన రాబర్ట్‌ బాష్‌ కంపెనీ ప్రస్థానం అంచలంచెలుగా ఎనిమిది రాష్ట్రాల్లో 18 తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరిందని, 32 వేల మంది అసోసియేట్లు కంపెనీలో పనిచేస్తున్నారని వివరించారు. కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలను ఆయన వివరిస్తూ... దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ల కార్ల సర్వీసింగ్‌ కోసం బాష్‌ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని 2025 నాటికల్లా కనీసం వెయ్యి కొత్త సర్వీస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ప్రస్తుతం 400 ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఉండగా... వాటిని 972 ప్రాంతాలకు విస్తరించనున్నామని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వపు బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని రూ.7.5 లక్షల కోట్లకు పెంచడాన్ని స్వాగతించిన డాక్టర్‌ స్టెఫాన్‌ హటుంగ్‌ ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్‌లో బాష్‌ గ్రూపు డైరెక్టర్‌ సౌమిత్ర భట్టాచార్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భరత, మేకిన్‌ ఇండియా కార్యక్రమాలకు బాష్‌ తనదైన రీతిలో సాయం చేస్తోందని చెప్పారు. బాష్‌ ఉత్పత్తి చేస్తున్న అత్యాధునిక వీడియో నిఘా ఉత్పత్తులు, వీడియో అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్లు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయని, దేశంలోని యాభై మెట్రో రైలు ప్రాజెక్టుల్లోనూ బాష్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యుత్తు వాహనాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బాష్‌ వాటిల్లో వాడే బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే దిశగా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు