CAIT Diwali sales: దీపావళి అమ్మకాల్లో దేశీ తడాఖా.. చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం!

6 Nov, 2021 12:36 IST|Sakshi

సరిహద్దు వివాదాలు చైనాకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆశించినంత వేగంగా కాకపోయినా క్రమంగా చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత మొదలవుతోంది. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

పదేళ్ల రికార్డు బ్రేక్‌
దీపావళి పండగ వెలుగులు పంచింది. వ్యాపారుల గల్లా పెట్టెని గలగలమనిపించింది. పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వ్యాపారం పుంజుకుంది. ది కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (కైట్‌) జారీ చేసిన గణాంకాల ప్రకారం దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గడిచిన పదేళ్లలో ఈ స్థాయిలో బిజినెస్‌ ఎన్నడూ జరగలేదు. 

రిఫ్రెష్‌ అయ్యారు
ఏడాదిన్నర కాలంగా కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా భయాలు తొలగిపోతుండటం, త్వరలోనే పెళ్లిల సీజన్‌ మొదలవుతుండటంతో జనం షాపింగ్‌కు మొగ్గు చూపారు ఫలితంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా ఒత్తిడి నుంచి జనాలు రిఫ్రెష్‌మెంట్‌ కోరుకున్నారని, దాని ఫలితమే ఈ స్థాయి అమ్మకాలు అని కైట్‌ అంటోంది.

ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్లు
దీపావళికి జరిగిన అమ్మకాల్లో ఆన్‌లైన్‌ ద్వారా సుమారు 32 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల రూపాయల బిజినెస్‌ కంప్లీట్‌ అయ్యింది. దీపావళి బిజినెస్‌కి సంబంధించి ఒక్క ఢిల్లీలోనే ఏకంగా రూ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీపావళి అమ్మకాలకు సంబంధించి డ్రై ఫ్రూట్స్‌, స్వీట్స్‌, హోం డెకార్‌, ఫుట్‌వేర్‌, టాయ్స్‌, వాచెస్‌ల విభాగంలో భారీగా అమ్మకాలు జరిగాయని కైట్‌ అంటోంది.

చైనాకు షాక్‌
ది కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (కైట్‌) దేశంలో 7 కోట్ల మంది వర్తకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కైట్‌ జాతీయ అధ్యక్షుడిగా భార్తీయా, జనరల్‌​ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్‌ వాల్‌లు కొనసాగుతున్నారను. వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం.. ఈసారి దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలను, పేపర్‌ వస్తువులను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. చైనా వస్తువులు కొనడం కంటే దేశీయంగా స్థానికులు తయారు చేసిన వస్తువులు కొనేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా చైనా మేడ్‌ దీపాలు, ఎలక్ట్రిక్‌ లైట్లకు గిరాకీ పడిపోయింది. ఇక బాణాసంచా విషయంలోనూ ఈ తేడా కనిపించింది. మొత్తంగా దీపావళి వ్యాపారానికి సంబంధించి రూ. 50 వేల కోట్ల వరకు చైనా ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. చైనా వస్తువులు దేశంలోని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు.

మరిన్ని వార్తలు