జూమ్‌ ఊస్టింగ్‌ ఘటన.. సెలవులపై వెళ్లమని ఒత్తిడి! ఆ సీఈవోను కొనసాగించడం కరెక్టేనా?

11 Dec, 2021 13:26 IST|Sakshi

CEO Vishal Garg Who Fired 900 On Zoom Call Takes Time Off With Immediate Effect:  బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవోగా కిందటి ఏడాది ఫోర్బ్స్‌ జాబితాకు ఎక్కిన విశాల్‌ గార్గ్‌.. ఈమధ్య జూమ్‌ మీటింగ్‌ వ్యవహారంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. జూమ్‌ మీటింగ్‌ జరుగుతుండగా మధ్యలో ఒకేసారి 900 మందితో ‘మీ ఉద్యోగాలు పోయాన’ని ప్రకటించాడు. దీంతో రగడ మొదలైంది. 


ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగుల లేఆఫ్‌ ప్రకటన చేసిన బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ తీరును టెక్‌ దిగ్గజాలు సైతం తప్పుబట్టారు. ఈ విమర్శల పర్వం మధ్యే తాను చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాడు విశాల్‌. అయినప్పటికీ వివాదం సర్దుమణగడం లేదు. ఈ తరుణంలో శుక్రవారం అర్థాంతరంగా ఆయన్ని సెలవులపై తప్పించడం చర్చనీయాంశంగా మారింది. 

జూమ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన విశాల్‌కు.. ఈ-మెయిల్‌ ద్వారా సెలవులపై వెళ్లాలని బెటర్‌ డాట్‌ కామ్‌ కంపెనీ ఒత్తిడి చేసినట్లు రాయిటర్స్‌ ఓ కథనం ప్రచురించింది.  ఈ మేరకు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కెవిన్‌ ర్యాన్‌ ప్రస్తుతం బెటల్‌ డామ్‌ వ్యవహరాలను చూసుకుంటున్నారు. అంతేకాదు బోర్డుకు రిపోర్ట్‌ చేసే బాధ్యతను కూడా ఆయనే స్వీకరించారు అని ఆ కథనంలో పేర్కొంది.  

అయితే కెవిన్‌తో పాటు కీలక వ్యవహారాలను చూసుకునేందుకు స్వతంత్ర్య బోర్డు (మూడో పార్టీ)కు బాధ్యతలు అప్పగించడమే అసలు ఆసక్తికి కారణమైంది. బిజినెస్‌ టైకూన్‌ల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, షేర్ల విలువ పడిపోతుండడంతో విశాల్‌కు బెటర్‌ డాట్‌ కామ్‌ శాశ్వతంగా పక్కన పెట్టనుందా? అనే అనుమానం వ్యక్తం చేసింది రాయిటర్స్‌. అయితే ఇదంతా జిమిక్కు అని, వ్యవహారం చల్లబడే వరకు మాత్రమే బెటర్‌ డాట్‌ కామ్‌ తీసుకున్న చర్య మాత్రమేనని ఓ బిజినెస్‌ డెయిలీ కథనం ప్రచురించింది. పైగా క్రిస్మస్‌ బోనస్‌ అందుకున్న విషయాన్ని సైతం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే ఈ  ఊహాగానాలపై బెటర్‌ డాట్‌ కామ్‌ స్పందించలేదు.

‘‘విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్‌ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. 

ఇక మరో వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఓ అడుగు ముందుకేశారు.  ‘ఇది సబబేనా? కాదా? ఇలాంటి పొరపాటు తర్వాత ఆ కంపెనీ సీఈవో మనుగడ కొనసాగించగలడు అని మీరు భావిస్తున్నారా? అతనికి(విశాల్‌) మరో ఛాన్స్‌ ఇవ్వడం కరెక్టేనా? న్యాయమా?’ అంటూ ట్విటర్‌ ఫాలోవర్స్‌ అభిప్రాయాన్ని కోరారాయన.

తొలగింపునకు కారణం ఇదే..
ఇదిలా 2016లో న్యూయార్క్‌ కేంద్రంగా బెటర్‌ డాట్‌ కామ్‌ మోర్టగేజ్‌ లెండింగ్‌ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్‌ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్‌ డాట్‌ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మార్కెట్‌, పర్‌ఫార్మెన్స్‌, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు భారత సంతతికి చెందిన విశాల్‌ గార్గ్‌. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్‌లైన్‌లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్‌ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు