కంపెనీల్లో నయా ట్రెండ్‌, కాఫీ కప్పులతో ఉద్యోగులు.. బాసుల్లో గుబులు!

19 Dec, 2023 16:21 IST|Sakshi

ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను రద్దు చేస్తున్నాయి. ఆఫీసుకు రావాలని పిలుపునిస్తున్నాయి. దీంతో సుదీర్ఘ కాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలని ఆదేశించడం ఉద్యోగులకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే కాఫీ బ్యాడ్జింగ్‌ అనే కొత్త ట్రెండ్‌తో సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నారు. 

కాఫీ బ్యాడ్జింగ్‌ అంటే? 
కోవిడ్‌-19 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్‌లతో ఆఫీస్‌లకు కొత్త కళ వచ్చింది. దీంతో కరోనా మహమ్మారితో రిమోట్‌గా వర్క్‌ చేస్తున్న సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. 

ఎవరైతే ఆఫీస్‌లో పనిచేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆ ఉద్యోగులు.. ఆఫీస్‌లో ఐడీని స్వైప్‌ చేస్తారు. ఆ తర్వాత సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడే హెచ్‌ఆర్‌, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతుంటారు.  ఆ తర్వాత డెస్క్‌కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్‌ అంటారు. 

ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే
ఈ ఏడాదిలో హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ప్రతి 5 మందిలో 1 ఒకరు పూర్తిస్థాయిలో ఆఫీస్‌లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది హైబ్రిడ్‌ వర్క్‌ను కోరుకుంటుంటే 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్‌ వర్క్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్‌ ల్యాబ్స్‌’ అనే సంస్థ తెలిపింది.

రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్‌ 
ఓల్‌ ల్యాబ్స్‌ చేసిన అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్‌లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడుతున్నారు. ధోరణి అక్కడితో ఆగలేదు. మరో 8 శాతం మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడడంతో ఆఫీస్‌ కార్యకలాపాలు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది.  

కాఫీ బ్యాడ్జింగ్‌ను పులిస్టాప్‌ పెట్టాలంటే  
'కాఫీ బ్యాడ్జింగ్' ట్రెండ్‌ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. కమ్యూనికేషన్‌ను పెంపొందించాలి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఆఫీస్‌ వాతావరణం సైతం ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు