సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!

15 Oct, 2020 05:07 IST|Sakshi

ఈఎంఐల మారటోరియం సమయంలో చక్రవడ్డీ రద్దుపై కేంద్రానికి సుప్రీం వ్యాఖ్యలు

రూ.2 కోట్ల వరకూ ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని మార్గనిర్దేశం

నవంబర్‌ 2న కేసు తదుపరి విచారణ

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి ప్రేరిత సమస్యల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) మారటోరియం పథకం కింద  రూ.2 కోట్ల వరకూ రుణాలపై నెలవారీ వాయిదాల(ఈఎంఐ)కు చక్రవడ్డీ మాఫీని ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ‘‘సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని ఈ  సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నవంబర్‌ 14వ తేదీ దీపావళి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  ‘‘సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, చక్రవడ్డీ భారం లేకుండా చూసే అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. మీరు మాకు కేవలం ఒక్క అఫిడవిట్‌ అందజేశారు అంతే. వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నారన్న అంశమే మాకు ఇప్పుడు ప్రధానం. ఇందుకు తగిన ఆదేశాలను ఇచ్చారా? లేదా అని మాత్రమే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం’’ అని  జస్టిస్‌ అశోక్‌ భూషన్, జస్టిస్‌ ఆర్‌ సుభాషన్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రం తరఫున వీడియో–కాన్ఫరెన్సింగ్‌ ద్వారా వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. 

  ‘‘తగిన పటిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. కరోనా కష్టకాలం నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్‌బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం విధించడం తెలిసిందే. అయితే కేంద్రం  నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమని బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ హరీష్‌ సాల్వే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మారటోరియం కాలానికి సంబంధించి ప్రస్తుత రుణాలపై వడ్డీమీద వడ్డీవేస్తూ, బ్యాంకులు సొమ్ము చేసుకోవడం తగదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ దత్తా న్యాయస్థానానికి విన్నవించారు. రూ.2 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారిపై చక్రవడ్డీ తగదన్నారు. ‘‘తగిన ద్రవ్య విధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణా లను మొండిబకాయిగా వర్గీకరించవద్దంటూ ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాము’’ అని  బెంచ్‌ స్పష్టం చేసింది.

డిఫాల్ట్‌ కాని రుణాలకే పునరుద్ధరణ: ఆర్‌బీఐ
ముంబై: రుణాల పునరుద్ధరణ అవకాశం ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో ఎటువంటి వైఫల్యాలు లేని ప్రామాణిక ఖాతాలకే ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత మార్చి నుంచి ఆగస్ట్‌ వరకు ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆగస్ట్‌ తర్వాత కూడా అనేక రంగాల్లో పరిస్థితులు కుదుటపడకపోవడంతో రుణాల పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రుణ గ్రహీతలు, రుణదాతలకు స్పష్టతనిస్తూ ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

► మార్చి 1 నాటికి 30 రోజులకు పైగా రుణ చెల్లింపులు బకాయి పడి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ అవి పునరుద్ధరణకు అర్హమైనవి కావు.
► ఇక అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు, కార్యకలాపాలను వాయిదా వేసిన వాటికి సంబంధించిన రుణాలను కూడా ఈ పథకం నుంచి ఆర్‌బీఐ మినహాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నాటి ఆదేశాలు, ఇతర మార్గదర్శకాలు వీటికి అమలవుతాయి.
► ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణమిచ్చినట్టయితే.. ఆ రుణ పునరుద్ధరణకు గాను అన్ని సంస్థలు సంయుక్తంగా కలసి ఇంటర్‌ క్రెడిటార్‌ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది.
► జూన్‌ 26 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం మారినప్పటికీ.. అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్‌ బీఐ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్టు తెలిపింది.
► ప్రాపర్టీపై రుణాలకూ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కాకపోతే అవి వ్యక్తిగత రుణాల్లోకి రాకూడదు.
► సాగుకు సంబంధించి అన్ని రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి సంబంధించినవీ ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే పాడి, మత్స్య, పశు సంరక్షణ, పౌల్ట్రీలకు ఇచ్చిన రుణాలకు ఈ అవకాశం ఉండదు.

మరిన్ని వార్తలు