హెయిర్‌ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్‌

23 Sep, 2021 21:25 IST|Sakshi

హెయిర్‌ కటింగ్‌ చేయడంలో జరిగిన పొరపాటుకి శిక్షగా న్యాయస్థానం ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి రెండు కోట్ల రూపాయల ఫైన్‌ విధించింది. మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా గురువారం తీర్పు వచ్చింది.

2018 ఏప్రిల్‌ 18న మోడల్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసింది. హెయిర్‌ కటింగ్‌ చేసుకునేందుకు ఆ రోజు హోటల్‌లో ఉన్న సెలూన్‌కి ఆ మహిళ వెళ్లింది. ‘ తనకు ఇంటర్వ్యూ ఉందని, జుట్టును కింది నుంచి నాలుగు అంగులాల వరకు  కత్తరించమని’ సూచించింది. హెయిర్‌ డ్రస్సర్‌ కటింగ్‌ చేస్తుండగా ఆమె కళ్ల జోడు తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత డ్రెస్సర్‌ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించుకుంది. తీరా కటింగ్‌ పూర్తయిన తర్వాత చూస్తే  జుట్టును కింది నుంచి కాకుండా  మొదలు నుంచి నాలుగు అంగుళాల వరకు ఉండేలా కటింగ్‌ చేశారు.

తనకు జరిగిన నష్టంపై సదరు మహిళ హోటల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా... వారు సరైన స్పందన ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ నేషనల్‌ కన్సుమర్‌ డిస్ప్యూట్‌ రీడ్రెస్సల్‌ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)ని సంప్రదించింది. 

హోటల్‌ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, పైగా వారు ఉపయోగించిన కెమెకల్స్‌ వల్ల తన స్కాల్ప్‌ పాడైందంటూ కోర్టుకు విన్నవించింది. తనకు పొడవైన జుట్టు ఉండటం వల్ల పలు ప్రముఖ కంపెనీల షాంపూ యాడ్లలో నటించాని, ప్రస్తుతం తనకు ఆ అవకాశం పోయిందంటూ కోర్టుకు వివరించింది.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఐటీసీ మౌర్య హోటల్‌లో ఉన్న హెయిర్‌ డ్రెస్సర్‌, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించింది. జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 2 కోట్లను బాధిత మహిళకు చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 

చదవండి : వర్కింగ్‌ విమెన్‌: మీకోసమే ఈ డ్రెస్సింగ్‌ స్టైల్‌
 

మరిన్ని వార్తలు