తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం..

2 Dec, 2023 13:42 IST|Sakshi

బైర్రాజు రామలింగరాజు అలియాస్‌ సత్యం రామలింగరాజు అంటే 2009కు పూర్వం ఒక సంచలనం. 1987లో హైదరాబాద్‌లోని ఓ చిన్న భవనంలో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ 2008 నాటికి ఏటా రూ.12 వేల కోట్లు రెవెన్యూ సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆ 20 మంది ఉద్యోగులు కాస్తా 52000 వేల మంది అయ్యారు. దాంతో దేశంలోనే టాప్‌ 5 కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్‌ చోటు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఫార్చున్‌ 500 కంపెనీల్లో 187 స్థానాన్ని చేజిక్కించుకుంది. కేవలం రూ.10కు స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీ షేర్‌ధర ఏకంగా రూ.544కు పెరిగింది. దేశంలోనే కాకుండా న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లోనూ సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ట్రేడయ్యేది. ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలానుకున్న అప్పటి యువతకు రామలింగరాజు ఎంతో ఆదర్శంగా కనిపించేవారు. అంత సామ్రాజ్యాన్ని విస్తరించిన కంపెనీ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు చేసిన చిన్న తప్పిదంతో అంతా కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బైర్రాజు రామలింగరాజు సెప్టెంబర్‌ 16, 1954లో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జన్మించారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బీకామ్‌ చదివారు. తర్వాత అమెరికాలో ఓహయో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. 1977లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామలింగరాజు 22 ఏళ్ల వయసులో నందినిని వివాహం చేసుకున్నారు. 

రామలింగరాజు పలు వ్యాపారాల్లోకి ప్రవేశించారు. రూ.9 కోట్ల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ వంటి సంస్థలు స్థాపించాడు. ఈ వ్యాపారాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంవైపు మొగ్గుచూపారు. దాంతో మేటాస్ ఇన్‌ఫ్రా అనే సంస్థను స్థాపించారు.

  • రామలింగరాజు 1987లో సికింద్రాబాద్‌లోని పీ అండ్ టీ కాలనీలో 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్స్ పేరుతో కంప్యూటర్ సేవల సంస్థను స్థాపించారు.
  • 1991లో సత్యం కంప్యూటర్స్ జాన్ డీర్ అనే ఫార్చ్యూన్ 500 సంస్థ నుంచి ప్రాజెక్టు దక్కించుకుంది.
  • 1992లో ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదయింది.
  • 1998లో రామలింగరాజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యం కంప్యూటర్స్ సంస్థను 50 వేల ఉద్యోగులతో 50 దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.
  • 1999లో రాజు అప్పుడే ప్రజాదరణ పొందుతున్న ఇంటర్నెట్‌ను ఆధారం చేసుకుని సత్యం కంప్యూటర్స్‌కు  అనుబంధ సంస్థగా సత్యం ఇన్‌ఫో వే (సిఫీ) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను తర్వాత వేగేశ్న సంస్థకు విక్రయించారు.

సత్యం కుంభకోణం

జనవరి 2009లో సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు సత్యం కంపెనీ పటిష్ఠంగా ఉందని మదుపరులను ఆకర్షించడానికి గత అక్టోబర్‌లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ‘ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ ఇంతలా పడిపోతున్నా సత్యం కంపెనీ భారీ లాభాల్లో ఉంది’ అని రాజు అన్నారు. అప్పటికే కొంతకాలంగా మేటాస్‌ ఇన్‌ఫ్రాలో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు మేటాస్‌ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. కంపెనీకి అన్ని లాభాలు వస్తున్నపుడు మేటాస్‌లో వాటా కొనుగోలు చేయచ్చుకదా అనే ప్రశ్నలు మదుపరుల్లో ఎక్కువయ్యాయి. డిసెంబర్‌ 2008లో మేటాస్ కొనుగోలు ప్రయత్నం విఫలం కావడంతో భారతీయ పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ పాలనపై ఆందోళన మొదలైంది. సత్యం షేరు ధరపడిపోయింది. 

జనవరి 2009లో సత్యం కంపెనీ బ్యాలెన్స్‌షీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించానని రాజు ఒప్పకుంటూ లేఖ రాశారు. 2003–07లో సత్యం బ్యాలెన్స్ షీట్‌లోని మొత్తం ఆస్తులు వాస్తవ విలువ కంటే మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల అకౌంటింగ్ మోసాన్ని అంగీకరించారు. ఒక చిన్న అబద్ధం.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తప్పు చేయడం.. ఇలా చేస్తూనే పోయామని ఆయన తన లేఖలో తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్‌లో తెలిపిన లాభాలు, వాస్తవ లాభాల్లో చాలా తేడాలున్నాయి. 2003 నుంచి 2007 మధ్య కాలంలో ప్రతి త్రైమాసికంలో అధికంగానే చూపించామని చెప్పారు. ఏళ్ల గడుస్తున్న కొద్దీ అది పెరుగుతూ పోయిందని తెలిపారు. ఆ మధ్యలో కంపెనీలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దానికితోడు 2008 ద్రవ్యోల్బణ ప్రభావంతో కంపెనీ కుప్పకూలిందని చెప్పారు. కొన్నిసార్లు నష్టాల్లో ఉన్న కంపెనీ త్రైమాసిక ఫలితాలను మెరుగ్గా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇది పులిపై స్వారీ చేస్తూ దానికి బలవుకుండా ఎలా దిగాలో తెలియనట్లుగా ఉందని రాజు వివరించారు. 

విచారణ సాగుతోందిలా..

రాజు ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్యం షేర్లలో వ్యాపారం చేయడానికి డమ్మీ ఖాతాలను ఉపయోగించారు. నిధులను పక్కదారి పట్టించేందుకు ఈ ఖాతాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ నగదు నిల్వలను రూ.7వేల కోట్లకు పెంచినట్లు రాజు అంగీకరించారు. జనవరి 2009న సత్యం బోర్డు నుండి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం సత్యం సంస్థ నిర్వహణను తాత్కాలికంగా కొందరు అధికారులకు అప్పచెప్పింది. తర్వాత 2009 ఏప్రిల్‌లో వేలం ప్రక్రియ నిర్వహించింది. దీనిలో టెక్ మహీంద్రా సత్యం కంపెనీని గెలుచుకుంది. దాంతో మహీంద్రా సత్యంగా పేరు మార్చింది.

రాజు, అతడి సోదరుడు కంపెనీ ఎండీ బి.రామరాజును వీఎస్కె కౌముది నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో భాగస్వాములైన రాజు కుటుంబ సభ్యులకు చెందిన 44 ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. 2009 సెప్టెంబర్‌లో రాజు చిన్నపాటి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. రోజుకు ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని, ప్రస్తుత సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను 26 అక్టోబర్ 2010న సుప్రీంకోర్టు రద్దు చేసి, నవంబర్ 2010లోగా లొంగిపోవాలని ఆదేశించింది. 

ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సకాలంలో అభియోగాలను దాఖలు చేయడంలో విఫలమైనందున సుప్రీంకోర్టు నవంబర్ 2011న రాజుకు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ చట్టం ప్రకారం నిందితుడిపై 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంటుంది. 2013 అక్టోబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాజుతో పాటు మరో 212 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేట్ ముసుగులో ఆదాయాన్ని దారి మళ్లించి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపింది. 2015 ఏప్రిల్‌లో రామలింగ రాజు అతని సోదరులకు ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5.5 కోట్ల జరిమానా విధించారు. 2015 మేలో దోషులుగా నిర్ధారించిన నెలలోపే రామలింగరాజు, మిగతా వారందరికీ హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ మంజూరుకు రాజు, అతడి సోదరునికి బెయిల్ కోసం రూ.10 లక్షలు, ఇతర దోషులకు రూ.  50 వేలు నిర్ణయించింది. 

2018 జనవరిలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ డైరెక్టర్లు, ఉద్యోగులకు సహకరించినందుకు గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్‌ను సెబీ దేశంలోని కంపెనీల్లో ఆడిట్‌ చేయకుండా రెండేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది.

ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు సెబీ తాజాగా 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ  రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఈ మొత్తాన్ని 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.

2000-2008 వరకు దాతృత్వ కార్యక్రమాలు..

బైర్రాజు ఫౌండేషన్

రామలింగరాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం రాజు, అతడి సోదరులు  రామరాజు, సూర్య నారాయణ రాజు కలిసి జులై 2001లో బైర్రాజు ఫౌండేషన్ స్థాపించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాల్లో 200 గ్రామాలను దత్తత తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, ప్రాథమిక విద్య, అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి వంటి 40 విభిన్న కార్యక్రమాలను అందించింది. 

అత్యవసర నిర్వహణ, పరిశోధనా సంస్థ (EMRI 108)

ఆగస్టు 2005లో రాజు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (EMRI 108) పేరుతో 24X7 అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర సేవలను అందించేలా ఉచిత ఫోన్ నంబరు సాకర్యం కల్పించారు. మొదట్లో కేవలం 75 అంబులెన్స్‌లతో ప్రారంభమైన ఎమ్రీ ప్రస్తుతం 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,697 అంబులెన్స్‌లకు విస్తరించింది. రోజుకు 26,710 అత్యవసర సేవలు అందిస్తోంది. 

ఆరోగ్య నిర్వహణ, పరిశోధన సంస్థ (HMRI 104)

సత్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 2007లో హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (HMRI 104) సేవలు ప్రారంభించారు. అర్హత కలిగిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సమాచారం అందుబాటులో లేని గ్రామీణ పేదల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ఇదీ చదవండి: ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్‌ హీరో

నాంది ఫౌండేషన్

1998లో నాంది ఫౌండేషన్‌ను అప్పటి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన వ్యాపార సంస్థల అధిపతులైన కె.అంజి రెడ్డి-డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రమేష్ గెల్లి-గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వ్యవస్థాపకులు, బైర్రాజు రామలింగరాజు-సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్, కె.ఎస్.రాజు నాగార్జున గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్‌లతో కలిపి దీన్ని రూపొందించారు. దీని వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను పెంచాలని నిర్ణయించారు. దాంతో సమాజంలోని పేద, అట్టడుగు వర్గాల ప్రజల్లో అక్షరాస్యత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పాఠశాలలలో ప్రతిరోజూ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు