ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు

5 Oct, 2023 17:40 IST|Sakshi

 దేశ ఆర్థిక  వ్యవస్థకు   క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఊతం: బీవోబీ

ఎకానమీకి రూ. 22 వేల కోట్ల బూస్ట్‌

ఐసీసీ  వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సమరం షురూ అయింది. అయితే  ఈ మెగా టోర్నీకి ఆతిథ్య దేశంగా ఇండియా ఉండటంతో  భారీ ఆదాయం సమకూరి, దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు  220 బిలియన్ రూపాయల (2.6 బిలియన్ల డాలర్లు)  భారీ ఆదాయం సమకూరుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన  క్రికెట్ ప్రపంచ కప్ UK GDPకి మంచి బూస్ట్‌ అందించిందని ఈసారి భారత్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అటు పండగ సీజన్‌, ఇటు వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ కారణంగా యాడ్‌ రెవెన్యూ భారీగా పెరగనుందనే అంచనాల మధ్య బీవోబీ  తాజా అంచనాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

గురువారం (అక్టోబరు 5) ప్రారంభమై నవంబర్ మధ్య వరకు జరిగే చతుర్వార్షిక టోర్నమెంట్ దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్దమొత్తంలో సందర్శకులను, క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుంది. దీంతో పలు రకాలుగా ఆదాయ వృద్ధి నమోదుకానుందని అంచనావేశారు. 10 నగరాల్లో జరిగే మ్యాచ్‌లతో ప్రయాణ, ఆతిథ్య రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని బీవోబీ ఆర్థికవేత్తలు జాహ్నవి ప్రభాకర్, అదితి గుప్తా అభిప్రాయపడ్డారు. 

చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ సహా 10 నగరాల్లో నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ సిరీస్‌ను చూసేందుకు వివిధ దేశాల నుంచి పర్యాటకుల సంఖ్య పెరగనుంది. ఇది ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే 80 - 90 శాతం  పెరుగుతుందని అంచనా. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?)

భారత్‌కు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. అది ఒక వేడుక.  ఇక భారత్‌లో జరిగే ప్రపంచకప్ సిరీస్ క్రికెట్ అభిమానులకు పండుగే. అందులోనూ 12 ఏళ్ల తరువాత (2011) తొలిసారి ఇండియాలో జరుగుతున్న ఈ  ఈవెంట్ సెప్టెంబర్‌లో ప్రారంభమైన మూడు నెలల పండుగ సీజన్‌తో సమానంగా ఉంటుందని,  చాలా మంది "సెంటిమెంటల్ క్రయవిక్రయాలు చేస్తారు కాబట్టి రిటైల్ రంగానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్ కోసం టెలివిజన్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా మొత్తం భారతీయ వీక్షకుల సంఖ్య 2019లో చూసిన 552 మిలియన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టీవీ హక్కులు ,స్పాన్సర్‌షిప్ రాబడిలో రూ. 10,500 కోట్ల నుండి రూ. 12,000 కోట్ల వరకు రావచ్చని వీరు భావించారు. 

మరోవైపు ప్రపంచ కప్  ధరల పెరుగుద కారణంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం  చేస్తుందని ఆర్థిక వేత్తలు  భావించారు.  ఈ సమయంలో  ఎయిర్‌లైన్ టిక్కెట్లు, హోటల్ అద్దెలు ఇప్పటికే పెరిగాయి. పండగసీజన్‌కు తోడు10 అతిధేయ నగరాల్లో అనధికారిక సెక్టార్‌లో సేవా ఛార్జీలు గణనీయమైన పెరుగుదల నమోదు కానుందన్నారు.  ఫలితంగా  అక్టోబర్ , నవంబర్‌లో ద్రవ్యోల్బణం 0.15 శాతం-0.25 శాతం మధ్య పెరగవచ్చని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు