Omicron Variant: ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!

29 Nov, 2021 18:19 IST|Sakshi

ఇప్పుడిప్పుడే కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్న ప్రపంచదేశాలకు ఒమిక్రాన్‌ రూపంలో భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారీ నష్టాన్ని కల్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీకాలను వేసుకున్న వారిని కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణుల హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతుంటే కొంతమందికి ఈ వేరియంట్‌ కాసుల వర్షం కురిపిస్తోంది. 

ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్‌ నడుస్తోంది. సుమారు 6000కుపైగా క్రిప్టోకరెన్సీలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని ఒక క్రిప్టోకరెన్సీయే ఒమిక్రాన్‌. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌కు డబ్లూహెచ్‌వో ఒమిక్రాన్‌గా నామకారణం చేసింది. ఏ ముహుర్తాన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్‌ పేరు పెట్టారో లేదో..! ఒమిక్రాన్‌ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా 945 శాతం మేర ఎగబాకింది.

CoinGecko ప్రకారం నవంబర్‌ 27న ఒమిక్రాన్‌ క్రిప్టోకరెన్సీ విలువ 65 డాలర్ల(రూ. 4,883) వద్ద ఉండగా..ప్రస్తుతం దీని విలువ 576.48 డాలర్లకు(43,311) కు చేరింది. ఒకానొక సమయంలో ఒమిక్రాన్‌ టోకెన్‌ గరిష్టంగా 689 డాలర్లను తాకింది. ఒమిక్రాన్‌ క్రిప్టో మార్కెట్‌ వాల్యూయేషన్‌ ఏకంగా 400 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ క్రిప్టో టోకెన్‌పై ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్‌ కాసుల వర్షం కురిపిస్తోంది. 

కరోనా పేరుతో భారీ నష్టాలు..!
ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఒమిక్రాన్‌ క్రిప్టో టోకెన్‌కు కాసుల వర్షం కురిపించగా...ఇందుకు విరుద్దంగా కోవిడ్‌-19 ప్రారంభంలో ప్రముఖ మెక్సికన్‌ బీర్‌ బ్రాండ్‌ కరోనా ఎక్స్‌ట్రా భారీ నష్టాలను మూటకట్టుకుంది. ఏకంగా రెండునెలల్లో 170 మిలియన్‌ డాలర్ల నష్టాలను కరోనా ఎక్స్‌ట్రా బీర్‌ కంపెనీ చవిచూసింది.

చదవండి: చైనా ఎఫెక్ట్‌! క్రిప్టో మైనర్ల ఒప్పందాలు.. కరెంట్‌ కోతలతో పక్కదేశాల వైపు చూపు

మరిన్ని వార్తలు