ఇన్వెస్టర్లకు షాక్‌ ! భారీగా నష్టపోతున్న దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

6 Jan, 2022 09:22 IST|Sakshi

ముంబై : కొత్త ఏడాదిలో వరుసగా నాలుగు రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలను పంచిన స్టాక్ మార్కెట్‌ గురువారం షాక్‌ ఇచ్చింది. మార్కెట్‌ ప్రారంభం అయ్యింది మొదలు ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు నిఫ్టీ వరుసగా పాయింట్లు కోల్పోతున్నాయి.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఊహించినదాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు డోలాయమానంలో పడ్డారు. దీంతో క్రిస్మస్‌ సీజన్‌ ముగిసిన తర్వాత న్యూ ఇయర్‌లో దేశీ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 

క్రితం రోజు 60లకు పైన ముగిసిన బీఎస్‌సీ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం నష్టాలతోనే మొదలైంది. దాదాపు 450 పాయింట్లు నష్టపోయి 59,731 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత కూడా వరుసగా పాయింట్లు నష్టపోతూ ఉదయం 9:15 గంటల సమయానికి 59,676 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌ మొదలైన పదిహేను నిమిషాల్లోనే 546 పాయింట్లు నష్టపోయింది. మరోసారి 60 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. మరోవైపు నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 17,768 దగ్గర ట్రేడవుతోంది. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగితే మరోసారి ఇన్వెస్టర్లు భారీ నష్టం తప్పదు.


 

మరిన్ని వార్తలు