డేటా బ్రీచ్ : డా. రెడ్డీస్‌కు భారీ షాక్ 

22 Oct, 2020 12:15 IST|Sakshi

డేటా లీక్ : ప్రపంచవ్యాప్తంగా ప్లాంట్స్ మూత

సాక్షి, ముంబై: హైదరాబాదుకు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డేటా షాక్  తగిలింది. సంస్థకు చెందిన సర్వర్లలో డేటాబ్రీచ్ కలకలం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాంట్లను సౌకర్యాలను మూసి వేసింది. సైబర్ దాడి నేపథ్యంలో అన్ని డేటా సెంటర్ సేవలను వేరుచేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల అందించిన సమాచారంలో డా.రెడ్డీస్  తెలిపింది. సైబర్ దాడిని గుర్తించిన నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో అన్ని సేవలను పునఃప్రారంభించాలని ఆశిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ముఖేష్ రతి తెలిపారు. ఇది తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదన్నారు.  (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్)

ఇండియా సహా, అమెరికా, యూకే, బ్రెజిల్, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమైనాయని డా.రెడ్డీస్ వెల్లడించింది. భారతదేశంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ  2-3 దశల హ్యూమన్ ట్రయల్స్‌ నిర్వహణకు  డా.రెడ్డీస్ కు డీజీసీఐ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించిన కొన్నిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ 4 శాతం కుప్ప కూలింది. మరోవైపు గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్‌ అందించిన ఫార్మా షేర్లు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అరబిందో ఫార్మా, సిప్లా భారీగా నష్టపోతున్నాయి. దీంతో  నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2.29 శాతం నష్టంతో ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు