ప్రథమార్ధంలో డీల్స్‌ జోరు

6 Aug, 2021 03:36 IST|Sakshi

తొలి ఆరు నెలల్లో 41 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు

పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ ప్రభావాలు భారత్‌లో ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్‌ రంగంలో డీల్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 41 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదరడం ఇందుకు నిదర్శనం. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జనవరి 1 నుంచి జూన్‌ 15 మధ్య కాలంలో దేశీ సంస్థలు 710 లావాదేవీలకు సంబంధించి 40.7 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

విలువపరంగా గతేడాది ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. జనవరి–జూన్‌ మధ్య కాలంలో ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) లావాదేవీలు ఆల్‌టైమ్‌ గరిష్టమైన 26.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. బిలియన్‌ డాలర్ల స్థాయి కొనుగోళ్లు, స్టార్టప్‌లు పలు విడతలుగా నిధులు సమీకరించడం తదితర అంశాలు .. డీల్స్‌ జోరుకు దోహదపడ్డాయి. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్‌ .. టెక్నాలజీ విభాగంలోనూ, పర్యావరణ..సామాజిక..గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) విభాగంలోనూ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ దినేష్‌ ఆరోరా తెలిపారు.  

ఇతర విశేషాలు..
► ప్రథమార్ధంలో 6.2 బిలియన్‌ డాలర్ల విలువ చేసే విలీన, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) ఒప్పందాలు కుదిరాయి.
► అదానీ గ్రీన్‌ ఎనర్జీ సుమారు 3.5 బిలియన్‌ డాలర్లకు ఎస్‌బీ ఎనర్జీ ఇండియాను, ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 1.45 బిలియన్‌ డాలర్లు పెట్టి బ్రిటన్‌కు చెందిన క్యాప్‌కోను కొనుగోలు చేశాయి.
► ఇవి కాకుండా విదేశాలకు చెందిన సంస్థల కొనుగోళ్లకు సంబంధించి 26 డీల్స్‌ కుదిరాయి. వీటి విలువ 385 మిలియన్‌ డాలర్లు.
► టెక్నాలజీ రంగంలో పీఈ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి.
► 2021లో 16 స్టార్టప్‌లు..యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సంస్థలు) క్లబ్‌లో చేరాయి.

మరిన్ని వార్తలు