డేంజర్‌: ఇది జరిగితే మీ బ్యాంక్‌ అకౌంట్‌ ప్రమాదంలో ఉన్నట్టే.. తస్మాత్‌ జాగ్రత్త!

1 Jul, 2023 16:10 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్‌ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. 

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్‌సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్‌లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్‌ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ  అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

ఉన్నట్టుండి సిమ్‌ డీయాక్టివేట్‌ అయితే.. 
బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో  భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్‌సైట్‌లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి  పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్‌ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్‌ సిమ్‌ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్‌ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

 

ఈ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నదెవరు?
నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్‌సైట్‌లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్‌ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్‌సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్‌సైట్లు, టెలీగ్రామ్‌ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా?

మరిన్ని వార్తలు