ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? లేదా? లేదంటే కత వేరుంటది!

12 Jul, 2022 11:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ( ఐటీఆర్‌)  దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  గడువులోగా ఐటీ రిటర్స్  ఫైల్‌ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం.

గడువు కంటే ముందే  ఐటీ రిటర్న్స్‌ ఫైల్  చేయడంలోని  ప్రాముఖ్యత, ప్రయోజనాలు
♦ పన్ను చెల్లింపుదారులు ఏదైనా జరిమానా లేదా పెనాల్టీని నివారించడానికి గడువు ముగిసేలోపు  ఐటీఆర్‌ను  తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
♦ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తులు,  ఉద్యోగుల ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31.
♦ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన  వారికి  గడువు అక్టోబర్ 31. 

పెనాల్టీ
గడువు తేదీలోపు ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా  జరిమానా, ఇతర పరిణామాలను  ఎదుర్కోవాల్సి  ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా  చెల్లించాలి.

చట్టపరమైన చర్య
ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్‌) దాఖలు ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు  మనమిచ్చిన సమాధానంతో  ఐటీ డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందకపోతే, ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసును కూడా  ఎదుర్కోవాలి.

రుణాలను పొందడం సులభం
ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఫైలింగ్‌లో క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే, బ్యాంకులనుంచి రుణాలను పొందడం సులభమవుతుంది. లోన్లను అందించే సమయంలో  ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్‌మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే.  సో.. అధికారిక రుణం కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఫైలింగ్‌ తప్పనిసరి. ఐటీఆర్‌ ఫైల్ చేయని వ్యక్తులు సంస్థాగత రుణదాతల నుండి రుణాలు పొందడం కష్టం

కేరీ ఫార్వర్డ్‌ లాసెస్‌ 
గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ఫార్వార్డ్ చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు అనుమతిస్తాయి. ఇది పన్ను చెల్లింపు దారులు తమ భవిష్యత్ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి  ఉపయోగపడుతుంది.
 
త్వరగా వీసా కావాలంటే 
వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్‌ ఫైలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌  క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్‌ ఫైలింగ్‌ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్‌ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్‌ ఈజీ అవుతుంది. 

మరిన్ని వార్తలు