బుల్‌ రన్‌, దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్‌

16 Nov, 2023 07:40 IST|Sakshi

ముంబై: అమెరికా, భారత్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో బుధవారం దేశీయ స్టాక్‌ సూచీలు నెల గరిష్టంపైన ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు, బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు 14 ట్రేడింగ్‌ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు 
రాణించడంతో బుధవారం సెన్సెక్స్‌ 742 పాయింట్లు పెరిగి 65,676 వద్ద ముగిసింది. నిఫ్టీ 232 పాయింట్లు బలపడి 19,675 వద్ద నిలిచింది.

బలిప్రతిపద సెలవు తర్వాత ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్‌లో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు భారీగా డిమాండ్‌ నెలకొనడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ సూచీలు వరుసగా 1.13%, 0.91% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.550 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.610 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ సూచీ (హాంగ్‌సెంగ్‌) అత్యధికంగా 4% ర్యాలీ చేసింది. జపాన్‌ నికాయ్‌ 2.50%, కొరియా, థాయిలాండ్‌ సూచీలు 2%, ఇండోనేషియా, సింగపూర్‌ సూచీలు 1% చొప్పున లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1% మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.  

‘అమెరికా, బ్రిటన్, భారత్‌ల్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఫెడరల్‌ రిజర్వ్‌తో సహా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు సంకేతంగా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టాయి. పండుగ సీజన్, మెరుగైన కార్పొరేట్‌ ఫలితాలతో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపొచ్చు. ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ తిరిగి 20,000 స్థాయిని అందుకోవచ్చు’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

దీపావళి బోనస్‌ : రూ.3.29 లక్షల కోట్లు 
దలాల్‌ స్ట్రీట్‌ ఒక శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్‌ ఇచ్చింది. సెన్సెక్స్‌ 742 పాయింట్లు పెరగడంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3.29 లక్షల కోట్లు పెరిగి రూ.325.41 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌ 2%, ఇండస్‌ఇండ్‌ 1%, పవర్‌గ్రిడ్‌ 1% మాత్రమే నష్టపోయాయి.  

అదరగొట్టిన ఆస్క్‌ ఆటోమోటివ్‌ లిస్టింగ్‌  
ఆస్క్‌ ఆటోమోటివ్‌ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.282)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12 శాతానికి పైగా ర్యాలీ 
చేసి రూ.317 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 10% లాభపడి రూ.310 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,115 కోట్లుగా నమోదైంది.  

రూపాయి రికవరీ  
జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి రూపాయి రికవరీ అయ్యింది. డాలర్‌ మారకంలో 24 పైసలు బలపడి 83.09 స్థిరపడింది. అంతర్జాతీయంగా డాలర్‌ విలువ రెండేళ్ల కనిష్టాన్ని తాకడం దేశీయ కరెన్సీకి కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో రిస్క్‌ సామర్థ్యం పెరిగిందని ఫారెక్స్‌ నిపుణులు తెలిపారు. ఈ సోమవారం 83.33 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. కాగా బలప్రతిపద సందర్భంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయలేదు.   

మరిన్ని వార్తలు