డాక్టర్‌ రెడ్డీస్‌- సాగర్‌ సిమెంట్స్‌.. దూకుడు

30 Jul, 2020 11:35 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ 4 శాతం అప్‌

రెండు రోజుల్లో 10 శాతంపైగా హైజంప్‌

సరికొత్త గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 

12 శాతం దూసుకెళ్లిన సాగర్‌ సిమెంట్స్‌

నెల రోజుల్లో 50 శాతం ర్యాలీ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు దూకుడు చూపుతోంది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాగర్‌ సిమెంట్స్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌
కోవిడ్‌-19 నేపథ్యంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో వరుసగా రెండో రోజు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 4481 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4495 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బుధవారం సైతం ఈ షేరు 6.3 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. స్థూల మార్జిన్లు 4.3 శాతం పెరిగి 56 శాతానికి చేరాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కోచైర్మన్‌ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్‌ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్‌ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్‌ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్‌-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్‌ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. 

సాగర్‌ సిమెంట్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో దక్షిణాది సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ నికర లాభం 22 శాతం బలపడి రూ. 36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ. 264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సాగర్‌ సిమెంట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం దూసుకెళ్లి రూ. 521 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 528 వరకూ ఎగసింది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్‌ 50 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నేటి ట్రేడింగ్‌లో తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 12,000 షేర్లు చేతులు మారాయి. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,500 షేర్లు మాత్రమే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా