డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 959 కోట్లు

11 May, 2023 03:51 IST|Sakshi

క్యూ4లో రూ. 6,297 కోట్ల ఆదాయం

రూ. 40 తుది డివిడెండు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్‌ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది.

ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు.

ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ చెప్పారు.  పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు ..
► గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది.
► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది.
► యూరప్‌ మార్కెట్‌ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది.
► ఫార్మా సర్వీసులు, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి.  
► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది.

 

మరిన్ని వార్తలు