లాభాల్లోకి టాటా మోటార్స్‌

3 Nov, 2023 04:13 IST|Sakshi

క్యూ2లో రూ. 3,783 కోట్లు

జేఎల్‌ఆర్‌ అమ్మకాలు జూమ్‌  

న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది.  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–
సెపె్టంబర్‌(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

బ్రిటిష్‌ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్‌ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది.

ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్‌ఆర్‌ ఆదాయం 30 శాతం జంప్‌ చేసి 6.9 బిలియన్‌ పౌండ్లకు చేరింది. హోల్‌సేల్‌ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్‌–మార్చి)లో హోల్‌సేల్‌ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్‌) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్‌ పౌండ్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్‌ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది.
ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు