కరోనా ముందు కంటే తక్కువే

26 Sep, 2022 06:16 IST|Sakshi

ఆర్థిక కార్యకలాపాలపై ఏడీబీ నివేదిక

6.7 శాతానికి ద్రవ్యోల్బణ అంచనా పెంపు

న్యూఢిల్లీ: ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి రావడానికి ముందు నాటి స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే, ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు ఆర్‌బీఐ రేట్ల పెంపును నిదానంగా అనుసరించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చంటూ ఏడీబీ గతంలో వేసిన అంచనాలను, తాజాగా 6.7 శాతానికి పెంచింది. ఇక తదుపరి ఆర్థిక సంవత్సరం (2023–24)లో ద్రవ్యల్బణం 5 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను 5.8 శాతానికి సవరించింది.

ఇది ఆర్‌బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి కొంచెం తక్కువని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో గరిష్ట స్థాయిల్లోనే చలిస్తుందని ఏడీబీ తన తాజా నివేదికలో అంచనా వేసింది. సరఫరా వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయన్న ఏడీబీ.. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున డిమాండ్‌ వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని వివరించింది. ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి ముందు కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపును చేపడుతుందని.. ద్రవ్యోల్బణాన్ని అంతర్జాతీయ అంశాల కంటే స్థానిక సరఫరా సమస్యలే ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది.  

అంతర్జాతీయ ప్రభావం
‘‘ఆర్థిక రంగ కార్యకలాపాలు ఇంకా మెరుగుపడాల్సి ఉన్నందున ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును వచ్చే ఏడాది వరకు నిదానంగా చేపట్టొచ్చు. అదే సమయంలో రూపాయి మారకాన్ని తనంతట అదే స్థిరపడేలా వదిలేయవచ్చు. ఇది బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌కు సాయపడుతుంది’’అని ఏడీబీ తన నివేదికలో వివరించింది. అంతర్జాతీయ డిమాండ్‌ బలహీనంగా ఉన్నందున వచ్చే రెండేళ్లపాటు భారత్‌ వృద్ధి, ఎగుమతులు గణనీయంగా ప్రభావితమవుతాయని అంచనా వేసింది. ఈ అంశాల ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటు అంచనాను ఏడీబీఏ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.  

మరిన్ని వార్తలు