కొత్త ఏడాదిలో ఎలన్‌ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!

4 Jan, 2022 18:49 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కొత్త ఏడాది 2022లో తన జోరును కొనసాగిస్తున్నారు. 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్‌ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్‌లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. టెస్లా అమ్మకాలు భారీగా పెరగడంతో కంపెనీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగింది. 

నాల్గవ త్రైమాసిక ఫలితాలు వచ్చిన తరువాత టెస్లా షేర్లు సోమవారం 13.5% పెరిగి $1,199.78కు చేరుకున్నాయి. దీంతో ఎలోన్ మస్క్ సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ సంపద సోమవారం 33.8 బిలియన్ డాలర్లు పెరిగి 304.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, గంటకు 1.4 బిలియన్ డాలర్లకు పైగా సంపాదన పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద 196 బిలియన్ డాలర్లుగా ఉంది. నవంబర్, డిసెంబర్ ప్రారంభంలో తగ్గిన కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ కంటే గత నెలలో కంపెనీ విలువ $1 ట్రిలియన్పెరిగింది. టెస్లాలో సుమారు 18% కలిగి ఉన్న మస్క్, సంస్థలో తన వాటాలో 10 శాతం అమ్మేస్తాను అని చెప్పినప్పుడు షేర్లు భారీగా కుప్పకూలాయి. మస్క్ నవంబర్ నుంచి ఇప్పటివరకు టెస్లాలోని 10 బిలియన్ డాలర్లు విలువైన వాటాలను విక్రయించాడు.

(చదవండి: టెస్లా రికార్డులు, 3నెలల్లో 3లక్షలకు పైగా కార్ల అమ్మకాలు!)

మరిన్ని వార్తలు