ట్విటర్ బ్లూటిక్ పై ఎలాన్ మస్క్ మరో ట్విస్ట్?

30 Nov, 2022 18:04 IST|Sakshi

సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం తీసుకోనున్నారు. యాపిల్‌ సంస్థ యాప్‌ స్టోర్‌ ఫీజు 30 శాతం వసూలు చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. 

మస్క్‌ నవంబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అమలు చేశారు. 8 డాలర్లు చెల్లించిన యూజర్లకు వెరిఫైడ్‌ ట్విటర్‌ అకౌంట్‌తో పాటు అదనంగా కొన్ని ఫీచర్లను అందించడం ప్రారంభించారు. అయితే దశల వారీగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఈ లేటెస్ట్‌ పెయిడ్‌ వెర్షన్‌ను అందించారు. యూజర్లు సైతం 8 డాలర్లు చెల్లించి ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌ స్క్రిప్షన్‌ను తీసుకున్నారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. కొద్ది మొత్తం చెల్లిస్తే ఒరిజనల్‌ ట్విటర్‌ అకౌంట‍్లతో పాటు ఫేక్‌ అకౌంట్లకు సైతం ఈ పెయిడ్  వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ తీసుకునే సదుపాయం లభించింది. 

దీంతో ఒరిజినల్‌ ట్విటర్‌ అకౌంట్‌లను వినియోగిస్తున్న దిగ్గజ కంపెనీలు ఫేక్‌ ట్వీట్‌ల దెబ్బకు వేలకోట్లు నష్టపోవడంతో..మస్క్‌ పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌పై వెనక్కి తగ్గారు. డిసెంబర్ 2 నుంచి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ట్విటర్ బ్లూ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లకు అందించేందుకు మస్క్‌ మరి కొంత కాలం ఎదురు చూసే ధోరణిలో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

యాపిల్‌ పై ఆగ్రహం 
గత కొన్ని రోజులుగా మస్క్..యాపిల్‌ సంస్థ యాప్‌ స్టోర్‌లో అవలంభిస్తోన్న విధానాల్ని బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ఫీజు 30 శాతం వసూలు చేయడంపై మండి పడుతున్నారు. ఆ విమర్శలపై స్పందించిన యాపిల్‌..ట్విటర్‌లో తన ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇలా నవంబర్ 10 నుండి 16 వరకు యాపిల్ ట్విటర్ ప్రకటనల కోసం సుమారు $131,600 మాత్రమే ఖర్చు చేసింది. అక్టోబర్ 16 నుండి 22 వరకు $220,800 నుండి తగ్గిందని ఒక నివేదిక సూచించింది.  

చదవండి👉 వైరల్‌: ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్‌’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు

మరిన్ని వార్తలు