ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం హైజంప్‌

6 May, 2023 06:45 IST|Sakshi

క్యూ4లో రూ. 954 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 954 కోట్ల నికర లాభం ఆర్జించింది. 62 శాతం ఎగసింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికం కాగా.. ఇందుకు పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదపడినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 61 శాతం ఎగసి రూ. 3,165 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) రూ. 1,970 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 25 శాతం పుంజుకుని రూ. 1,909 కోట్లను అధిగమించింది. ఇతర ఆదాయం 58 శాతం ఎగసి రూ. 734 కోట్లను తాకింది. దీంతో రికార్డ్‌ లాభం ఆర్జించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.78 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి.

మరిన్ని వార్తలు