ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు

10 Sep, 2021 10:36 IST|Sakshi

స్థిరమైన వృద్ధికి సంజీవ్‌ సన్యాల్‌ సూచన 

ముంబై: సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి ఒక్కఈక్విటీ మార్కెట్ల మద్దతే చాలదని.. బ్యాంకు రుణాల మాదిరి డెట్‌ మార్కెట్లు సైతం బలంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వ్యక్తం చేశారు. బ్యాంకులు బ్యాలన్స్‌ షీట్లను శుద్ధి చేసుకున్నాయని.. అవి ఇప్పుడిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా రుణ వితరణను వేగవంతం చేయాలని సూచించారు. బ్యాంకింగేతర రుణ సంస్థల లాబీ గ్రూపు ఎఫ్‌ఐడీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంజీవ్‌ సన్యాల్‌ మాట్లాడారు. ‘‘ఆర్థిక చరిత్రను పరిశీలించినట్టయితే.. దీర్ఘకాలంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగడం అన్నది ఒక్క ఈక్విటీ మార్కెట్ల నిధుల చేదోడుతోనే సాధ్యం కాలేదు. డెట్‌ క్యాపిటల్‌ (రుణాలు) మద్దతుతో ఇది సాధ్యమైంది. ఎక్కువ మొత్తం బ్యాంకుల నుంచి నిధుల సాయం అందుతోంది’’ అని సన్యాల్‌ పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ మార్గం మెరుగ్గానే ఉందన్న ఆయన.. అదే సమయంలో డెట్‌ మా ర్కెట్‌ చెడ్డగా ఏమీ లేదన్నారు. 

పెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరం 
‘‘భారత్‌ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగాలంటే అందుకు..  ప్రస్తుతమున్న దానితో పోలిస్తే అతిపెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థ కావాలి. బ్యాంకులు తమ రుణ వితరణ కార్యకలాపాలను విస్తరించాలి’’ అని సంజీవ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. బ్యాంకులు ఎన్నో ఏళ్ల పాటు బ్యాలన్స్‌షీట్లను ప్రక్షాళన చేసుకున్నందున అవి తమ రుణ పుస్తకాన్ని మరింత విస్తరించుకోవడానికి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. చైనా జీడీపీ సైతం బ్యాంకు బ్యాలన్స్‌ షీట్ల విస్తరణ మద్దతుతో మూడు దశాబ్దాల కాలలో బలమైన వృద్ధిని చూసినట్లు పేర్కొన్నారు.
చదవండి: ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం

మరిన్ని వార్తలు