Infosys: ఈ కామర్స్‌ స్పెషల్‌.. ఈక్వినాక్స్‌ సొల్యూషన్స్‌ | Sakshi
Sakshi News home page

Infosys: ఈ కామర్స్‌ స్పెషల్‌.. ఈక్వినాక్స్‌ సొల్యూషన్స్‌

Published Fri, Sep 10 2021 10:43 AM

Infosys Subsidiary Equinox Commence Operations Officially - Sakshi

న్యూఢిల్లీ: కంపెనీలు తమ డిజిటల్‌ వాణిజ్య సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా ఈక్వినాక్స్‌ పేరిట కొత్త సొల్యూషన్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్లుగా ప్రయోగదశలో దీనికి మంచి స్పందన వచ్చిందని ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కర్మేష్‌ వాస్వాని తెలిపారు.

ఈ రంగాలకు అనువుగా
ప్రస్తుతం ఏటా 15 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ–కామర్స్‌ లావాదేవీల నిర్వహణకు పలు అంతర్జాతీయ సంస్థలు దీన్ని ఉపయోగిస్తున్నాయని కర్మేష్‌ వాస్వాని పేర్కొన్నారు. రిటైల్, టెలికం, ఆటోమోటివ్, తయారీ, మీడియా స్ట్రీమింగ్‌ తదితర సంస్థల కోసం ఈక్వినాక్స్‌ అనువుగా ఉంటుందని వాస్వాని వివరించారు. ఇన్ఫీ ఆదాయంలో దాదాపు 15 శాతం వాటా ప్రస్తుతం రిటైల్‌ విభాగానిదే ఉంటోంది. అటు డిజిటల్‌ టెక్నాలజీ సంబంధ సర్వీసులు, సొల్యూషన్స్‌ వాటా 48.5 శాతంగా ఉంది. చాలా మటుకు కంపెనీలకు డిజిటల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ.. చురుగ్గా వ్యవహరించగలిగే చిన్న స్థాయి డిజిటల్‌ సంస్థల నుంచి వాటికి ముప్పు పొంచి ఉందని వాస్వాని వివరించారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు పెద్ద కంపెనీలు ..సంక్లిష్టమైన తమ ప్లాట్‌ఫాంలను సులభతరంగా మార్చుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ఈక్వినాక్స్‌ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు.  
చదవండి: ఎంఆర్‌వో సేవలకు హబ్‌గా భారత్‌!

Advertisement
Advertisement