ఆరునెలల గరిష్ఠానికి చేరిన ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల ఖర్చు

22 Oct, 2023 19:26 IST|Sakshi

కేంద్రంపై అదనంగా రూ.4.5 లక్షల కోట్ల భారం

సెంట్రల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో ఆరునెలల గరిష్ఠాన్ని తాకినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం..సెప్టెంబర్‌లో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చులు ఆరు నెలల గరిష్టానికి పెరిగాయి. సెంట్రల్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో అసలు వ్యయం కంటే 21.92% ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఇది 19.08%గా ఉంది. దాంతో కేంద్రం అదనంగా రూ.4.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. 

ఫలితంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు చేసే వ్యయం మొత్తం రూ.24.8 లక్షల కోట్లుగా ఉండనుంది. అయితే అవి పూర్తయ్యే సమయం కూడా అంతకు ముందు అంచనా వేసిన 36.96 నెలల నుంచి 38.63 నెలలకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టుతో పోలిస్తే ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య సెప్టెంబర్‌లో 830 నుంచి 823కు తగ్గాయి. కానీ అందులో 58శాతం రెండేళ్లుగా ఆలస్యమవుతున్న వాటి జాబితాలో ఉ‍న్నాయి. సెప్టెంబర్‌లో 46 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు నివేదికలో తెలిపారు.

మరిన్ని వార్తలు