విదేశాల్లో దేశీ పెట్టుబడులు తగ్గాయ్‌

11 Jan, 2022 08:54 IST|Sakshi

డిసెంబర్‌లో కార్పొరేట్ల వెనకడుగు

ముంబై: గత నెలలో దేశీ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులను తగ్గించుకున్నాయి. దీంతో డిసెంబర్‌లో ఈ పెట్టుబడులు 8 శాతం క్షీణించి 2.05 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2020 డిసెంబర్‌లో విదేశీ భాగస్వామ్య సంస్థలు, సొంత అనుబంధ కంపెనీలలో దేశీ కంపెనీలు 2.23 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2021 డిసెంబర్‌లో దేశీ కంపెనీలు 1.22 బిలియన్‌ డాలర్లను గ్యారంటీల జారీ రూపంలో ఇన్వెస్ట్‌ చేశాయి. ఈక్విటీ రూపేణా దాదాపు 46.44 కోట్ల డాలర్లు, రుణాల ద్వారా మరో 36.72 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి.  

ఓలా టాప్‌లో.. 
ప్రధానంగా మొబిలిటీ సొల్యూషన్ల కంపెనీ ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌.. సింగపూర్‌ అనుబంధ సంస్థలో 67.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ యూఎస్‌ భాగస్వామ్య సంస్థలో దాదాపు 15 కోట్ల డాలర్ల పెట్టుబడులను చేపట్టింది. ఈ బాటలో రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ జర్మనీలోని జేవీతోపాటు, నార్వేలోని పూర్తి అనుబంధ సంస్థలో 16.86 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. పీఎస్‌యూ దిగ్గజం గెయిల్‌ ఇండియా మియన్మార్‌లోని జేవీసహా, యూఎస్‌ అనుబంధ సంస్థలో 7.01 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. ఇదేవిధంగా ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్‌జీసీ వివిధ దేశాలలోని ఐదు వెంచర్లలో 7.415 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది.  
 

మరిన్ని వార్తలు