8 శాతం వరకూ ఎకానమీ వృద్ధి

12 Dec, 2023 05:22 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఫిక్కీ విశ్లేషణ

2024–24లోనూ 8 శాతంగా అంచనా

ప్రైవేటు పెట్టుబడుల పురోగతి, సానుకూల వాతావరణం దన్ను

న్యూఢిల్లీ: వృద్ధి ఊపందుకోవడం, సానుకూల సెంటిమెంట్లు, పెరుగుతున్న ప్రైవేట్‌ పెట్టుబడుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్‌ ఎకానమీ 7.5 నుండి 8 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నట్లు భారత్‌ వాణిజ్య పరిశ్రమల మండళ్ల సమాఖ్యకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్‌ అనిష్‌ షా విశ్లేషించారు.

2025 ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే భారత్‌ వృద్ధి అవకాశాలపై భౌగోళిక రాజకీయ ఒత్తిడి ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.  మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న షా ఈ మేరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు..

► మనం ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో  వరుసగా 7.8 శాతం, 7.6 శాతం వద్ద మంచి వృద్ధి రేటులను చూశాము. వెరసి ఏప్రిల్‌–సెపె్టంబర్‌ వరకూ 7.7 శాతం పురోగతి నమోదయ్యింది. వృద్ధి ఊపందుకుంటోంది కాబట్టి... ఇదే చక్కటి ఎకానమీ ఫలితాలు కొనసాగుతాయని నేను భావిస్తున్నాను.
► మన ఎకానమీకి ప్రస్తుత సవాలు అంతర్జాతీయ పరిణామాలే. మన ఎకానమీ ఇజ్రాయెల్‌–గాజాకు సంబంధించిన ప్రభావాలను చూస్తోంది. ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో మనకు తెలిసిందే. ఆయా ఉద్రిక్తతలు విస్తరించకూడదని మన కోరిక. ప్రతి ఒక్కరి పురోగతి కోసం శాంతి అవసరం.  
► ఇక రెండవ సమస్య విషయానికి వస్తే... పాశ్చాత్య దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు. అక్కడ సమస్యలు  తగ్గాయని మేము అనుకోవడం లేదు.  భారతదేశంలో మనం చూసిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆయా దేశాల్లో వడ్డీ రేటు ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక సంక్షోభ ప్రభావాలు ఉంటే, అవి తప్పనిసరిగా భారతదేశంపై కూడా ప్రభావాన్ని ఊపుతాయి.  
► విదేశాల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వృద్ధి జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది.  అంతేకాకుండా, అనేక భారతీయ కంపెనీలు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే రీతిలో తమ బ్యాలెన్స్‌ సీట్లను పటిష్టం చేసుకోవాలి.  
► భారతీయ కంపెనీలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి చూస్తే, సెంటిమెంట్‌ సానుకూలంగా ఉంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. సామర్థ్యాల మెరుగుదల కొనసాగుతోంది. డిమాండ్‌ పరిస్థితులు కూడా బాగున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతోంది కాబట్టి పెట్టుబడుల వేగం మరింత పెరుగుతోంది.  
► రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి తర్వాత వరుసగా ఐదవసారికూడా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.5 శాతం)ను యథాతథంగా కొనసాగించడం సరైనదే. ఈ విషయంలో ఆర్‌బీఐ  ప్రో–యాక్టివ్‌గా ఉండడం హర్షణీయం. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ ముందస్తు చర్యలు తీసుకుంది.  ఇది కీలకమైన అంశం. రేట్లు తగ్గించడం కంటే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడమే ముఖ్యమైన అంశం. ఇది ఇప్పటివరకు పనిచేసింది. ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ఆర్‌బీఐ చక్కటి చర్యలు తీసుకుందన్న నిపుణుల విశ్లేషణను నేను సమరి్థస్తాను. అయితే దీర్ఘకాలిక దృక్పథంతో ఆర్థిక వ్యవస్థను మంచి మార్గంలో ఉంచిన తర్వాత రేటు తగ్గింపుకు అవకాశం ఉండి, ఆర్‌బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటే పరిశ్రమ దానిని స్వాగతిస్తుంది.  
► 2047 నాటికి దేశాన్ని ‘వికసిత భారత్‌’ లక్ష్యం వైపు నడిపించేందుకు ఫిక్కీ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది.  మేక్‌ ఇన్‌ ఇండియా చొరవ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతి, సుస్థిరతలకు సంబంధించి వృద్ధి లక్ష్యాల సాధనకు ఫిక్కీ తగిన కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది.

2024–25లో వృద్ధి 6.5 శాతమే: యాక్సిస్‌ బ్యాంక్‌
అమెరికాలో మాంద్యం ఖాయమని సూచన
2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమవుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ నీలకంత్‌ మిశ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. దేశీయంగా ఎకానమీ క్రియాశీలత బాగున్నప్పటికీ, అంతర్జాతీయ అంశాలే ప్రతికూలతలని మిశ్రా పేర్కొన్నారు.

అమెరికా ఎకానమీ ఇంకా సమస్యలోంచి బయటపడలేదని, దీర్ఘకాలంగా భయపడుతున్న మాంద్యపు భయాల అంచనా వాస్తవమని పేర్కొన్నారు. అమెరికాకు ద్రవ్యలోటు ప్రధాన సమస్యని పేర్కొన్న ఆయన, ‘‘అమెరికాలో మాంద్యం ఆలస్యం అయింది.  వాయిదా పడలేదు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక సవాళ్లను అన్ని వర్గాలు తక్కువగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ క్లిష్టమైన అంశంపై చర్చ లేకపోవడంపై తాను ఆందోళన చెందుతున్నానని ఆర్థికవేత్త పేర్కొన్నారు.

భారతదేశం వంటి దేశాలు అనుసరించే వివేకవంతమైన ఆర్థిక చర్యలకు బదులుగా, అమెరికా సాంప్రదాయక ‘ప్రో సైక్లికల్‌ పాలసీ’ని అనుసరించినట్లు ఆయన విశ్లేషించారు. భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు విధాన నిర్ణయాల దిశలో పెద్దగా మార్పుకు దారితీయబోవని పేర్కొన్నారు.  తాను కార్పొరేట్‌ అయినట్లయితే, తక్షణ డిమాండ్‌ కారణంగా త్వరగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుని ఉండే వాడినని మిశ్రా అన్నారు.

విద్యుత్‌కు సంబంధించి బొగ్గు ఆధారిత, పునరుత్పాదక ఇంధన ఆధారిత రంగాల్లో పెట్టుబడులు చక్కటి ఫలితాలను ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా విభాగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయనీ వివరించారు. అస్థిర ఆహార ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తన రెపో రేటును 2024లో తగ్గించే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే 2024లో ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ద్రవ్యలోటు సవాళ్లు తగ్గినప్పటికీ విదేశీ రేటింగ్‌ ఏజెన్సీలు భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం లేదని పేర్కొన్న ఆయన, ఇందుకు తొలుత భారత్‌ అధిక రుణ–జీడీపీ నిష్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

>
మరిన్ని వార్తలు