FSSAI: న్యూస్‌ పేపర్‌లో ఆహారం ప్యాక్‌ చేయొద్దు

29 Sep, 2023 04:53 IST|Sakshi

అలా చేస్తే వినియోగించొద్దు

ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది

వ్యాపారులు, వినియోగదారులకు సూచనలు

న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్‌ పేపర్‌) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్‌ పేపర్‌ను ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్‌ పేపర్‌లో ప్యాక్‌ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది.

ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్‌ పేపర్‌ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్‌ మెటీరియల్స్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి.

అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.

వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్‌ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. 

మరిన్ని వార్తలు