ఇకపై వాటిని మిల్క్‌ అంటే కుదరదు! ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!

7 Sep, 2021 16:40 IST|Sakshi

ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్‌ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్‌ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. 

ఫుడ్‌ సేఫ్టీ కి ఫిర్యాదులు
మార్కెట్‌లో సోయా మిల్క్‌, బాదం మిల్క్‌, కోకోనట్‌ మిల్క్‌ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్‌ చేసేప్పుడు మాత్రం మిల్క్‌ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ మిల్క్‌ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్‌ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 

15 రోజుల్లోగా మార్చేయండి
మిల్క్‌ ప్రొడక్టుల పేరుతో మార్కెట్‌లో బేవరేజ్‌పై ‘మిల్క్‌ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్‌ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్‌ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్‌ సంస్థలకు ఆదేశాలు అందాయి.

గడువు పెంచండి
ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్‌ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్‌లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. 

స్పష్టత కావాలి
ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్‌ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్‌ మార్కెట్‌ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్‌ ప్రొడక్ట్‌ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్‌ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్‌ మార్కెట్‌ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.   
చదవండి: ‘హారన్‌’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో!

మరిన్ని వార్తలు