వృద్ధిలో రత్నాలు–ఆభరణాల రంగం కీలకం

12 Oct, 2023 06:28 IST|Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలో రత్నాలు, ఆభరణాల రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రత్నాలు, ఆభరణాల ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రత్నాలు– ఆభరణాల రంగం ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లిస్తుంది.

ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది’’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి పేర్కొన్నారు. భారత్‌ ఆభరణాల తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లలో సమస్యలను ఎదుర్కొంటున్నారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తమ ఆభరణాల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా తయారీదారులు, వ్యాపారులు ప్రపంచ వజ్రాభరణాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించగలరన్న విశ్వాసాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు.  

15–22 తేదీల్లో షాపింగ్‌ ఫెస్టివల్‌
కాగా, ఆభరణాల తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఎగుమతిదారుల అత్యున్నత స్థాయి మండలి– జీజేసీ అక్టోబర్‌ 15 నుంచి 22వ తేదీ వరకూ  దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యువెలరీ షాపింగ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు