బడ్జెట్‌ 2021 : పడిన పసిడి ధర

1 Feb, 2021 15:29 IST|Sakshi

 దేశీయంగా  పడిన బంగారం ధర

వెండి కూడా వెలవెల

దిగుమతి సుంకం తగ్గింపు

2.5 అగ్రి సెస్‌

సాక్షి,న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక ప్రతిపాదన చేసింది. బంగారంపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. బంగారంపై సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని  ఆర్థిక మంత్రి . తద్వారా  పసిడి ప్రేమికులకు ఊరట కలుగనుంది. అయితే 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాలు , అభివృద్ధి సెస్ (ఏఐడీసీ)ను  బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ అగ్రి సెస్ విధించడం వల్ల వినియోగదారులపై  భారం పడకుండా ఉండేందుకే, కస్టమ్స్ సుంకం రేట్లు తగ్గించినట్టు వెల్లడించారు. జూలై, 2019లో సుంకం 10శాతం నుండి పెంచిన తరువాత  విలువైన లోహాల (బంగారం,వెండి) ధరలు బాగా పెరిగాయి. వాటిని మునుపటి స్థాయిలకు దగ్గరగా తీసుకొచ్చేందుకు కస్టమ్ సుంకాన్ని హేతుబద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు.

అయితే  డైమండ్‌, బంగారు ఆభరణాల వ్యాపారుల దీర్ఘకాలిక డిమాండ్‌ కనుగుణంగా దిగుమతి సుంకం తగ్గింపు సరైన నిర్ణయమని మలబార్ గోల్డ్ అండ్‌  డైమండ్స్‌ చైర్మన్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు. దీంతోపాటు బంగారం అక్రమ లావాదేవీలను అడ్డుకునేందుకు ఇ-గవర్నెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా  దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా 3 శాతం కుప్పకూలింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,500 పడిపోయింది. రూ.47,918లుగా ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 1.2 శాతం పెరిగింది.  ఔన్స్‌కు 1872.4 డాలర్లుగా ఉంది.  సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్‌టైం గరిష్టం నుంచి దిగి వచ్చాయి.  కిలో ధర 73,508 వద్ద ట్రేడవుతోంది.  ప్రపంచ మార్కెట్లలో 10 శాతం పెరిగింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2019 జూలై నెలలో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఇటీవలికాలంలో పుత్తడి ఆల్‌టైం గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు