35 ఏళ్లలోపు రిటైర్‌.. చేతిలో రూ. 41 కోట్లు.. ఈ గూగుల్‌ ఉద్యోగి ప్లాన్‌ తెలిస్తే..!

3 Sep, 2023 22:33 IST|Sakshi

Google employee plan: సాధారణంగా యువత ఆలోచనలు ఇలా ఉంటాయి.. మంచి కంపెనీలో జాబ్‌ చేయాలి.. వృద్ధాప్యం వరకూ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి.. కుటుంబాలను సెటిల్‌ చేసి ఏ 60 ఏళ్లకో రిటైర్‌ కావాలి అనుకుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం 35 ఏళ్లకే రిటైర్‌ కావాలనుకుంటున్నాడు. అతని ప్లానింగ్‌ తెలిస్తే అదిరిపోతారు.

గూగుల్‌ (Google)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల ఇతాన్‌ నున్లీ (Ethan Nguonly).. వీలైనంత తొందరంగా అంటే 35 ఏళ్లలోపే రిటైర్‌ కావాలనుకుంటున్నాడు. ఆ లోపు 5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది.

ఇదీ చదవండి: వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు! 

ఆర్థిక భద్రత వైపు నున్లీ ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. తీర ప్రాంతంలో పెరిగిన నున్లీకి పెట్టుబడి ఆవశ్యకతను తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు. పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పేవారు. చిన్నతనం నుంచే ఆర్థిక పాఠాలు నేర్పించడంతో అతని ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

రెండేళ్లలోనే ఉన్నత విద్యాభ్యాసం
ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే నున్లీ దృఢ సంకల్పం కేవలం రెండేళ్లలోనే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసేలా చేసింది. అదే సమయంలో అతను పూర్తి సమయం ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఇన్ఫర్మేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు.

గూగుల్‌లో పని చేయాలనే నున్లీ ఆకాంక్ష 2021 డిసెంబర్‌లో  నిజమైంది. ఈ టెక్ దిగ్గజంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. బోనస్‌లు, స్టాక్ యూనిట్‌లతో కలిపుకొని నున్లీ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 1,94,000 డాలర్లు (దాదాపు రూ. 1.60 కోట్లు).

విస్తృతంగా పెట్టుబడులు
చిన్న వయసులోనే రిటైర్‌ కావాలన్న తన ఆశయం కోసం నున్లీ శ్రద్ధగా పెట్టుబడి పెడుతున్నాడు. వివిధ రిటైర్మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్లలో దాదాపు 1,35,000 డాలర్లు (దాదాపు రూ. 1.11 కోట్లు) ఇ‍ప్పటికే ఇన్వెస్ట్‌ చేశాడు.  తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఆస్తులను సంపాదించి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు.

బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన నున్లీ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నియమావళికి కట్టుబడి 60,000 డాలర్లను పొదుపు చేయగలిగాడు.ఈ ఆర్థిక క్రమశిక్షణ ఫ్లోరిడాలోని రివర్‌వ్యూలో అతని మొదటి పెట్టుబడి ఆస్తిని పొందేందుకు దోహదపడింది.

రాష్ట్రం వెలుపల రెంటల్‌ ప్రాపర్టీలను నిర్వహించడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, నున్లీ అంకితభావం ఫలించింది. తద్వారా అతను రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్థిరపడేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత నున్లీ కాలిఫోర్నియాలోని లా పాల్మాలో మొదటి ఇంటిని కొన్నాడు.

నున్లీ ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడుల కోసమే కేటాయించాడు. ఇలా ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో అధిక పెట్టుబడుల సంకల్పం సవాలుగా మారినప్పటికీ, నున్లీ తన టేక్-హోమ్ పేలో 35 శాతాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఎదురుదెబ్బలే పాఠాలు
పెట్టుబడులతో దూసుకెళ్తున్న నున్లీకి ఎదురుదెబ్బలూ తగిలాయి. 2021లో క్రిప్టోకరెన్సీలో మార్జిన్‌లో భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు సుమారు 80,000 డాలర్లు  నష్టపోయాడు. అయితే ఈ అనుభవం ఒక విలువైన పాఠంగా పనిచేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులపై, ప్రత్యేకించి ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్‌లపై మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించింది.

మరిన్ని వార్తలు