నవంబర్‌ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు

6 Aug, 2023 05:32 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్‌ పీసీల  దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్‌ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్‌ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్‌ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్‌ తప్పనిసరి.

కాగా, లైసెన్స్‌ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్‌ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్‌ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది.

మరిన్ని వార్తలు