థర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పైపైకి

27 May, 2022 00:33 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేట్‌ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది.

ఎలక్ట్రిక్‌ ప్రైవేట్‌ కార్లకు 30 కిలోవాట్‌ అవర్‌ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్‌ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్‌ ధరలను నోటిఫై చేసింది.

మరిన్ని వార్తలు