స్టార్టప్‌లకు ఉచితంగా 5జీ టెస్ట్‌బెడ్‌

1 Mar, 2023 04:53 IST|Sakshi

న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన అంకుర సంస్థలు, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) 2024 జనవరి వరకూ 5జీ టెస్ట్‌ బెడ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. మిగతా పరిశ్రమవర్గాలు, విద్యారంగం, సర్వీస్‌ ప్రొవైడర్లు, పరికరాల తయారీ సంస్థలు మొదలైన వర్గాలు నామమాత్రపు రేటుతో దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

ఇప్పటికే పలు స్టార్టప్‌లు, కంపెనీలు తమ ఉత్పత్తులు, సర్వీసులను పరీక్షించేందుకు ఈ టెస్ట్‌ బెడ్‌ను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. 5జీ సేవలకు ఊతమిచ్చే విధంగా రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌ బెడ్‌ను రూపొందించే ప్రాజెక్టుకు 2018లో టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. 2022 మే 17న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్‌ మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు టెస్ట్‌ బెడ్‌ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి.  

మరిన్ని వార్తలు