జోరుగా ఐఆర్‌సీటీసీ వాటా విక్రయం!

11 Dec, 2020 06:25 IST|Sakshi

తొలి రోజు 2 రెట్ల స్పందన...

నేడు రిటైల్‌ ఇన్వెస్టర్ల బిడ్‌లు 

ఫ్లోర్‌ప్రైస్‌ రూ.1,367

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఓఎఫ్‌ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీలో 20 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయిస్తోంది. గురువారం ఇష్యూ మొదలైన రోజునే ఈ ఓఎఫ్‌ఎస్‌ 1.98 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.  నేడు (శుక్రవారం) రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ బిడ్‌లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్‌ధరను రూ.1,367గా కంపెనీ నిర్ణయించింది.

రూ.4,374 కోట్ల నిధులు....
ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 15% వాటాకు సమానమైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. అదనంగా సబ్‌స్క్రైబ్‌ కావడంతో మరో 5% వాటా(80 లక్షల షేర్లను) గ్రీన్‌ షూ ఆప్షన్‌(అదనంగా బిడ్‌లు వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు)గా అట్టేపెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది.  ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,374 కోట్లు సమకూరుతాయని అంచనా.
 ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో కేంద్ర ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనలను పాటించాలంటే ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి  ఉంటుంది. భారత రైల్వేలకు ఐఆర్‌సీటీసీ కంపెనీ కేటరింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను విక్రయిస్తోంది. ఈ కంపెనీ 2019, అక్టోబర్‌లో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.645 కోట్లు సమీకరించింది.

ఓఎఫ్‌ఎస్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.1,452 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు