చిన్న సంస్థల ఎగుమతులకు ప్రభుత్వ సహకారం

1 Jul, 2022 03:06 IST|Sakshi

నూతన విధానాల రూపకల్పన

ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి చర్యలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

న్యూఢిల్లీ: చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ‘ఉద్యమి భారత్‌’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్‌ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు.

భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్‌ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్‌ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్‌.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు.
రుణాలకు సమస్యలు..
గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచ్చినవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్‌ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు