అది అవినీతి రాజధాని 

14 Nov, 2023 03:06 IST|Sakshi

బీజేపీపాలిత మధ్యప్రదేశ్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణ 

నీమచ్‌/హర్దా: ఏళ్లకేళ్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పాలిస్తూ బీజేపీ సర్కార్‌ ఈ రాష్ట్రాన్ని అవినీతి రాజధానిగా మార్చేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దుమ్మెత్తిపోశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని నీమచ్, హర్దా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అవినీతికి అంతేలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం ఖాయం.

మేం గెలిచాక రాష్ట్రంలో కులగణన చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ‘రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ సరఫరా చేస్తాం. రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ అమలుచేస్తాం. గోధుమలకు ఇస్తున్న కనీస మద్దతు ధరను రూ.3,000కు పెంచుతాం. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తాం’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు. ‘ 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ బడా పారిశ్రామికవేత్తలతో కలిసి కుట్రతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల పక్షపాత కాంగ్రెస్‌ను పక్కకునెట్టి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది’ అని ఆరోపించారు.  

దోచుకోవడంలో పోటీపడుతున్నారు 
వందలకోట్ల నగదు లావాదేవీలపై కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పెద్దకుమారుడు దేవేంద్ర ప్రతాప్‌ మాట్లాడినట్లు చెబుతున్న రెండు వీడియో క్లిప్‌లపై రాహుల్‌ స్పందించారు. ‘ కూర్చున్న చోట నుంచే కోట్లాది రూపాయలు ఎలా దోచేస్తున్నారో తోమర్‌ కుమారుడి వీడియో చూస్తే ఇట్లే తెలుస్తోంది. దేవేంద్రపై మోదీగానీ, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు విచారణకు ఆదేశించారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు.

‘బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్కువేం కాదు. రైతులు, కార్మికుల సొమ్ము దోచేసేందుకు పోటీపడుతున్నారు’ అని అన్నారు. ‘ అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే పెద్ద నోట్లను రద్దుచేశారు. కానీ ఏం సాధించారు? సంపన్నులే బాగుపడ్డారు. నిజానికి పెద్ద పారిశ్రామికవేత్తల కన్నా సమాజంలో చిన్న వ్యాపారులు, వర్తకులే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారు’ అని రాహుల్‌ అన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో 500 కర్మాగారాలు కొత్తగా పెట్టామని మోదీ బహిరంగంగా అబద్ధాలు చెబుతున్నారు. నాకైతే నీమచ్‌ జిల్లాలో ఒక్కటి కూడా కొత్త కర్మాగారం కనిపించలేదు’ అని రాహుల్‌ వివరించారు.  

మోదీ చెప్పేది అబద్ధం 
‘దేశంలో కులం అనేది లేదు. పేదరికం అనే కులం ఒక్కటే దేశాన్ని ఇబ్బందిపెడుతోందని మోదీ పదేపదే అబద్ధాలాడుతున్నారు. కేంద్రస్థాయిలో 93 మంది ‘ఉన్నతాధికారులు’ ఉంటే వారిలో ఓబీసీ వారు కేవలం 3 శాతమే. ఇక మధ్యప్రదేశ్‌లో అలాంటి ‘అధికారులు’ 53 మంది ఉంటే అందులో ఓబీసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఇలాంటి అన్యాయాలకు అడ్డుకట్ట వేసి కులగణన చేపట్టి సరైన న్యాయం చేస్తాం’’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు