పెరిగిన బ్యాంక్ లోన్స్.. ఆ రంగానికే ప్రాధాన్యం

4 Dec, 2023 08:48 IST|Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 14.9 శాతం అధికం

టర్మ్‌ డిపాజిట్ల పట్ల ఆకర్షణ

ఆర్‌బీఐ డేటా వెల్లడి 

ముంబై: ప్రైవేటు కార్పొరేట్‌ రంగానికి బ్యాంకుల రుణ వితరణ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 14.9 శాతం పెరిగినట్టు ఆర్‌బీఐ డేటా వెల్లడింంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ 14.7 శాతం వృద్ధి నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 11.5 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. 

బ్యాంకుల మొత్తం రుణాల్లో పరిశ్రమలకు ఇచ్చినవి 25 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8.6 శాతం పెరిగాయి. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాల వృద్ధి గత ఆరు త్రైమాసికాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. బ్యాంక్‌ రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం ఉన్న 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. 

మహిళా రుణ గ్రహీతల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు రుణాల్లో ఎక్కువ వృద్ధిని చూపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో, అధిక ఈల్డ్స్‌ వచ్చే డిపాజిట్లలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. 6 శాతం వడ్డీలోపు డిపాజిట్లు 2022 మార్చి నాటికి 85.7 శాతంగా ఉంటే, 2023 మార్చి నాటికి 38.7 శాతానికి, సెప్టెంబర్‌ వరికి 16.7 శాతానికి తగ్గాయి. 

రేట్లు పెరగడంతో కరెంట్, సేవింగ్స్‌ డిపాజిట్ల కంటే టర్మ్‌ డిపాజిట్లలోకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్లలో టర్మ్‌ డిపాజిట్ల వాటా ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 57 శాతం నుం సెప్టెంబర్‌ చివరికి 60 శాతానికి చేరింది. డిపాజిట్లను ఆకర్షించడంలోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లే ముందున్నాయి. మొత్తం టర్మ్‌ డిపాజిట్లలో 44 శాతం రూ.కోటికి పైన ఉన్నవే కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు