రానున్న సంవత్సరాల్లోనూ 6.5 శాతం పైనే వృద్ధి

26 Nov, 2022 06:18 IST|Sakshi

ఈ దశాబ్దం చివరి వరకు అంతే

సీఈఏ అనంత నాగేశ్వరన్‌

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి పట్ల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన సంవత్సరాల్లోనూ దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5–7 శాతం మధ్య ఉండొచ్చన్నారు. ఆర్‌బీఐతోపాటు అంతర్జాతీయ సంస్థలైన ఓఈసీడీ, ఐఎఎంఫ్‌ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ సమయంలో ఇది సహేతుకమే. రెండో త్రైమాసికం వృద్ధి గణాంకాలు కొన్ని రోజుల్లో వెలువడనున్నాయి.

దీంతో భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది’’అని నాగేశ్వరన్‌ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) భారత్‌ జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని సిటీ గ్రూపు అంచనా వేయగా, ఎస్‌అండ్‌పీ రేటింగ్స్‌ 7.3 శాతంగా ఉంటుందని పేర్కొనడం తెలిసిందే. కానీ, ఇక నుంచి ఏటా వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉంటుందన్న అంచనాను నాగేశ్వర్‌ వ్యక్తీకరించారు. మూలధన పెట్టుబడుల సైకిల్‌ తిరిగి వేగాన్ని అందుకోవడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, గత కొన్నేళ్లలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు మధ్యకాలానికి అధిక వృద్ధి రేటుకు బాటలు వేస్తాయన్నారు. వృద్ధికి మద్దతుగా, రేట్ల కఠినతరం విషయంలో ఆర్‌బీఐ కాస్త ఆచితూచి వ్యవహరించగా, నాగేశ్వరన్‌ దీనికి మద్దతుగా మాట్లాడారు. 2021–22లో రేట్ల కఠినతరం మరింత బలంగా ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు