సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు గిఫ్ట్‌గా కార్లు!

12 Apr, 2022 17:06 IST|Sakshi

తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ​కంపెనీ ఎదుగుదలలో శ్రమించిన ఉద్యోగుల కష్టాన్ని గుర్గించింది. ఏళ్ల తరబడి కంపెనీ అభివృద్ధికి తోడ్పాటును అందించిన ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది.

తమిళనాడుకు చెందిన ఐడియాస్‌2ఐటీ కంపెనీ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఒకప్పుడు చిన్న కంపెనీగా మొదలై నేడు 500ల మంది పని చేసే స్థాయికి చేరుకుంది. అయితే పదేళ్ల కిందట ఈ కంపెనీ ప్రస్థానం మొదలైనప్పుడు.. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కనుక చేరితే కంపెనీ లాభాలను ఉద్యోగులకు పంచి ఇస్తామంటూ ప్రకటించింది.

నష్టాల్లో ఉన్నప్పుడు ఒకలా, లాభాల్లోకి వచ్చినప్పుడు మరోలా ఐడియాస్‌2ఐటీ కంపెనీ యాజమాన్యం భావించలేదు. పదేళ్ల క్రితం ఐడియాస్‌2ఐటీ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన మాట నిలుపుకునే తరుణం వచ్చినట్టుగా గుర్తించింది. అనుకున్నదే తడవుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడిన వంద మంది ఉద్యోగులను గుర్తించి.. అందరికీ ఒకేసారి మారుతి సుజూకి కంపెనీకి చెందిన కార్లను బహుమతిగా అందించింది. వారి కుటుంబ సభ్యులను పిలిచి ఓ వేడుకగా ఈ కార్లను అందజేసింది.

తమిళనాడులోని చెన్నై కార్పోరేట్‌ వరల్డ్‌లో సరికొత్త కల్చర్‌ పెరుగుతోంది. కంపెనీ కోసం శ్రమించిన ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు గుర్తించి తగు విధంగా సత్కరిస్తున్నాయి. ఐడియాస్‌2ఐటీ కంపెనీ కంటే ముందు మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఈ సంస్థలోని ఎగ్జిక్యూటివ్‌ స్థాయి వారికి ఒక్కొక్కటి కోటి రూపాయలు విలువ చేసే ఐదు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించింది. 
 

మరిన్ని వార్తలు