భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం!

1 Apr, 2022 17:20 IST|Sakshi

ముంబై: ఎకానమీకి సాధారణంగా ప్రయోజనం చేకూర్చే మూలధన ప్రవాహాలు ఒక్కొక్కసారి నష్టాలకూ దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా  భారత్‌కు ఉందని కూడా ఆమె వివరించారు. కోవిడ్‌–19  సంక్షోభం ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో భారత్‌  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించిన సంగతి తెలిసిందే.  

ఈ నేపథ్యంలో గోపీనాథ్‌ మాట్లాడుతూ, మూలధన ప్రవాహాల నుండి వచ్చే నష్టాలను తగ్గించడానికి భారత్‌ పలు రక్షణాత్మక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. మూలధన ప్రవాహాలకు సంబంధించి సంస్కరణలు, నిర్వహణ అనే అంశంపై విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్‌ ఫ్లోస్‌కు సంబంధించి ‘అధ్యయనం ఆధారంగా’ పలు సలహాలను ఇచ్చారు.  ఈ అంశాల గురించి ఆమె ఏమన్నారంటే... 

మూలధన ప్రవాహాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.  తద్వారా అవసరమైన పెట్టుబడలు అందుతాయి. ఎకానమీకి కొన్ని విధానాలు వచ్చే  నష్టాలకు ఎదుర్కొనడానికి దోహదపడతాయి. భారతదేశానికి కూడా ఇదే తరహా ప్రయోజనాలు అందుతున్నాయి.  

అయితే నష్టాలూ ఇందులో ఇమిడి ఉన్నాయి. భారత్‌ విషయానికి వస్తే, మూలధన ప్రవాహాల విషయంలో దేశంలో ఇప్పటికే భారీగా పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం మారినప్పుడు భారత ప్రభుత్వం ఈ పరిమితులను చాలా చురుగ్గా ఉపయోగిస్తుంది.  కార్పొరేట్‌లు చేసే అంతర్జాతీయ రుణాల మొత్తంపై పరిమితులు విధించడం  ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం.  

► పటిష్ట విధానాలు, నియంత్రణలతో భారత్‌ దాని క్యాపిటల్‌ అకౌంట్‌ వ్యవస్థను సరళీకృతం చేసే ప్రక్రియలో ఉంది. భారత్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లు, సంస్థలు పరిపక్వతతో కూడిన నియంత్రణలో ఉండడం వల్ల దేశం మరిన్ని రూపాల్లో క్యాపిటల్‌ ఫ్లోస్‌ను అనుమతించే వీలుంది.
 
అంతర్జాతీయంగా మహమ్మారి ప్రారంభంలో మేము చూసిన ‘నాటకీయ’ మూలధన ప్రవాహాలు మళ్లీ ఇప్పుడు  ఉక్రెయిన్‌లో యుద్ధం తరువాత కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఆయా దేశాల విధాన నిర్ణేతలు సమగ్ర విశ్లేషణ జరుపుకోవాల్సి ఉంటుంది. 

తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వడ్డీ రేట్లు చాలా కాలంగా తక్కువగా ఉన్నందున, అధిక రాబడుల కోసం వర్ధమాన మార్కెట్లకు మూలధనం ప్రవహించింది. కొన్ని దేశాల్లో ఇది విదేశీ కరెన్సీలో ఆయా దేశాల అంతర్జాతీయ రుణాన్ని క్రమంగా పెంచడానికి దారితీసింది. విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా హెడ్జ్‌ల ద్వారా పరిష్కారింపలేని స్థాయికి కొన్ని దేశాల ఫైనాన్షియల్‌ వ్యవస్థలను అస్థిరపరిచే స్థాయికి ఇది చేరింది.  

సరళతర వడ్డీరేట్ల వ్యవస్థ తిరోగమనం పట్టిన సందర్భాల్లో వర్ధమాన దేశాల మార్కెట్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. అటువంటి గత అనుభవాలు, పరిశోధనల నుండి ఇప్పుడు  నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే,  కొన్ని పరిస్థితులలో స్థూల ఆర్థిక వ్యవస్థను అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి దేశాలు క్యాపిటల్‌ ఫ్లోస్‌పై  తగిన ముందస్తు జాగ్రత్తలు, విధి విధానాలు  తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు ఆర్థిక
సంక్షోభం తీవ్రతను తగ్గిస్తాయి.  

అంతర్జాతీయ రుణ బాధ్యతలు క్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల అనుకోకుండా ఆర్థిక స్థిరత్వానికి వచ్చే నష్టాలను ఈ అధ్యయనం వివరిస్తోంది. అంతర్జాతీయ విదేశీ మారకద్రవ్యానికి  సంబంధించి  అసమతుల్యతను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.  

అసమతౌల్య క్యాపిటల్‌ ఇన్‌ఫ్లో పెరుగుదలను ఎలా గుర్తించాలి? మూలధన ప్రవాహాలను సరళీకరించడం అవసరమా? కాదా? అని నిర్ణయించుకోవడంతో సహా ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై విధాన సలహాలు, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని నివేదిక విశ్లేషణాంశాలు అందిస్తాయి.  

డాలర్‌ ఆధిపత్యానికి ‘ఆంక్షలు’ గండి
ఉక్రెయిన్‌పై  యుద్ధం నేపథ్యంలో  రష్యాపై విధిస్తున్న ఆంక్షలు అమెరికా డాలర్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్‌ విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌ తక్కువ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధాన ప్రపంచ కరెన్సీగా కొనసాగడంలో ఎటువంటి అవరోధం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. 

 ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ‘విచ్ఛిన్నం’ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. భౌగోళిక ఉద్రిక్తత నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ వినియోగమూ పెరిగే వీలుందని విశ్లేషించారు. ‘‘యుద్ధం నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల నుండి స్టేబుల్‌కాయిన్‌లు– సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీల వరకు డిజిటల్‌ ఫైనాన్స్‌ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డిజిటల్‌ ఫైనాన్స్‌పై అంతర్జాతీయ నియంత్రణ ప్రస్తుతం అవశ్యం’’ అని ఆమె అన్నారు. ఇక  రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల  విభిన్న దేశాలు, దేశీయ గ్రూపుల మధ్య ప్రత్యేక వాణిజ్య అవగాహనలు, చిన్న కరెన్సీ బ్లాక్‌లు ఆవిర్భవించే అవకాశం ఉందని ఆమె అన్నారు. 

మరిన్ని వార్తలు