గ్యాస్‌ షేర్లు గెలాప్‌!

30 Mar, 2021 04:41 IST|Sakshi

పెరగనున్న గ్యాస్‌ లభ్యత ఎఫెక్ట్‌

శుద్ధ ఇంధనాలకు అధిక ప్రాధాన్యత

సపోర్ట్‌ చేయనున్న పైప్‌లైన్ల విస్తరణ

ఎరువులు, రిఫైనింగ్, సిటీగ్యాస్‌ నుంచి గిరాకీ

దేశీయంగా పెరగనున్న గ్యాస్‌ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్‌ తదితర అంశాలు ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్‌ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్‌ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్‌ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్‌ రవాణాకు అనువుగా పైప్‌లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్‌ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్‌ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్‌ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్‌ మెట్రిక్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్‌ ఓస్వాల్‌ రీసెర్చ్‌ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్‌లో బావుల నుంచి గ్యాస్‌ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది.

ఆర్‌ఐఎల్‌ రెడీ

రెండేళ్లలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్‌ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్‌ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్‌–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్‌ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్‌ కనిపించనున్నట్లు
అంచనా వేసింది.

తాజాగా పెరిగిన జోరు...
రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్‌ లభ్యత చేరింది. ఆర్‌ఐఎల్‌–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్‌ఎన్‌జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు డిమాండ్‌ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్‌ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ (జీఎస్‌పీఎల్‌), గెయిల్‌ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

సామర్థ్యం ఇలా...
ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్‌ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్‌ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్‌పీఎల్‌ కొన్ని కీలక పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్‌–భాధుట్, అంజార్‌–చోటిల్లా, అంజార్‌–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్‌ వల్ల గుజరాత్‌ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు