వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం

30 Mar, 2021 04:39 IST|Sakshi
మాట్లాడుతున్న మల్లాది విష్ణు, చిత్రంలో.. ఎంపీ నందిగం సురేష్, ఎమ్యేల్యే మేరుగ తదితరులు

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

ఘనంగా గురు రవిదాస్‌ 644వ జయంతి వేడుకలు

భవానీపురం (విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం లభిస్తుందని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఎస్సీలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అమరావతిలో దళితుల భూములను కొట్టేసిన ఘనుడని అన్నారు. సంత్‌ గురు రవిదాస్‌ 644వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సంస్కరణలను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అన్నారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులంతా సంఘటితంగా ఉండాలన్నారు.

సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అతి సామాన్యుడనైన నన్ను ఎంపీగా చేయడం, తిరుపతిలో డాక్టర్‌ గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపటం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సంత్‌ గురు రవిదాస్‌ తరువాత వచ్చిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జగజ్జీవన్‌రామ్, పూలే వంటి మహనీయులు అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమరవల్లి బాల కోటయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడు అప్పికట్ల రాము, విజయవాడ పట్టణ అధ్యక్షుడు కె.ఏసుదాసు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 400 మంది డప్పు కళాకారులు, చర్మకారులు వైఎస్సార్‌సీపీలో చేరగా.. నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

మరిన్ని వార్తలు