రెండేళ్లలో కో–లివింగ్‌ రెట్టింపు

25 Dec, 2021 04:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్‌ మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్‌ స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్‌ మార్కెట్‌ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్‌ మార్కెట్‌ రెట్టింపు అవుతుందని కొలియర్స్‌ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్‌ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది.

కోవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్‌ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్‌ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్‌ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్‌ మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు.

ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్‌ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్‌ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్‌ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్‌ వేవ్‌ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్‌ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు