ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!

7 Jan, 2023 07:56 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్‌ఎస్‌ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్‌ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం.  ఎన్‌ఎస్‌ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. 

 ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%.  
 
ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది.  

ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది.  

అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది.  

పబ్లిక్‌ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది.  

స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో  వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది.  

ఎన్‌ఎస్‌ఓ అంచనా  విలువల్లో. 
2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్‌ఎస్‌ఓ తాజా అంచనా.  అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట.   

మరిన్ని వార్తలు