‘భారత్‌ ఈ విషయంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిందే’

29 Sep, 2022 06:59 IST|Sakshi

లిథియం అయాన్‌ ఈవీ

బ్యాటరీలపై నివేదిక

10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

ఆర్థర్‌ డి లిటిల్‌ సంస్థ అంచనా

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా.. లిథియం అయాన్‌ బ్యాటరీ సెల్స్‌ తయారీ, వాటి ముడి సరుకుల శుద్ధి కోసం 2030 నాటికి 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (రూ.80వేల కోట్లు) అవసరమని ఓ నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం లిథియం అయాన్‌ బ్యాటరీ డిమాండ్‌ 3 గిగావాట్‌ హవర్‌ (జీడబ్ల్యూహెచ్‌)గా ఉంటే, 2026 నాటికి 20 గిగావాట్లకు, 2030 నాటికి 70 గిగావాట్లకు చేరుకుంటుందని పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ఆర్థర్‌ డి లిటిల్‌ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుత అవసరాల్లో 70 శాతం మేర లిథియం అయాన్‌ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్టు కేంద్ర గనుల శాఖ గణాంకాలను ప్రస్తావించింది.

‘‘2030 నాటికి కేవలం అదనపు లిథియం అయాన్‌ సెల్స్‌ డిమాండ్‌ను తీర్చేందుకే భారత్‌ 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుంది. ఇది బ్యాటరీ తయారీ, దాని అనుబంధ విభాగాల్లో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 

చైనాను చూసి నేర్చుకోవాలి 
‘‘చైనా గడిచిన పదేళ్ల కాలంలో ఈవీ బ్యాటరీ విభాగంలో సామర్థ్యాలను పెద్ద ఎత్తున పెంచుకుంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై భారీ పెట్టుబడులు, సానుకూల ప్రభుత్వ విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ముడి సరుకుల వనరులను (గనులు) వివిధ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా సొంతం చేసుకోవడం ద్వారా చైనా ఇప్పుడు తదుపరి తరం ఈవీల్లో కీలకంగా వ్యవహరించనుంది. ముడి సరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించడం, బ్యాటరీ ముడి సరుకులు దండిగా ఉన్న దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసుకుంది.

కనుక భారత్‌ తన పొరుగు దేశమైన చైనా అనుభవాల నుంచి నేర్చుకోవాలి’’అని ఈ నివేదిక సూచించింది.. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య సహకారాత్మక విధానం ఉండాలని, భారత్‌ను ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థానిక సరఫరా వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారించాలని కోరింది. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలను సొంతం చేసుకోవడంతోపాటు, బ్యాటరీల రీసైక్లింగ్‌కు సమగ్ర విధానం అవసమరని పేర్కొంది. పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, లిథియం పార్క్‌ల ఏర్పాటును సూచించింది.

చదవండి: మామూలు లక్‌ కాదండోయ్‌, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!

మరిన్ని వార్తలు