లిథియం అయాన్‌ నుంచి బయటకు రావాలి

10 Sep, 2022 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీలు) లిథియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీ వాడకం విషయంలో భారత్‌ ఆరంభంలోనే బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌. 

ఈ కమోడిటీపై మన దేశానికి ఎటువంటి నియంత్రణ లేదంటూ ఈ సూచన చేశారు. భవిష్యత్తులో గ్రీన్‌ రవాణా కోసం హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్స్‌ కీలకమని, దీనికి ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని కంపెనీలు ఏక కాలంలో కొత్త టెక్నాలజీలపైనా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ‘ఈవీ ఇండియా 2022’ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు.

లిథియం అయాన్‌ బ్యాటరీలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఎలా అన్న దానిపై దేశీయంగా ఎంతో పరిశోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. సోడియం అయాన్, జింక్‌ అయాన్‌ టెక్నాలజీలపై పరిశోధనలు నడుస్తున్నాయని వివరించారు. లిథియం అయాన్‌ను మన దేశం ఉత్పత్తి చేయడం లేదంటూ.. దీనిపై మనకు ఎటువంటి నియంత్రణ లేని విషయాన్ని సింగ్‌ గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
 
ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఈవీలన్నీ కూడా లిథియం అయాన్‌ బ్యాటరీతో తయారైనవే కావడం గమనార్హం. ‘‘గ్రీన్‌ హైడ్రోజన్‌ విషయంలో మనం జపాన్‌ స్థాయిలోనే ఉన్నాం. సోలార్‌ ఇంధనం ధర మన దగ్గర చాలా తక్కువ. కనుక గ్రీన్‌ హైడ్రోజన్‌ విషయంలో మనకు ఎంతో అనుకూలత ఉంది’’అని సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు