-

ప్రపంచ దేశాల్లో యూపీఐ పేమెంట్స్‌.. న్యూజిల్యాండ్‌తో భారత్‌ చర్చలు

30 Aug, 2023 09:12 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులకు కీలకంగా మారిన ‘యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ)ను న్యూజిలాండ్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అంశంపై భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ వాణిజ్య మంత్రి డామియెన్‌ ఓ కాన్నర్‌తో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చలు నిర్వహించారు.

యూపీఐతో రెండు దేశాల మధ్య సులభతర వాణిజ్యం, పర్యాట రంగ ప్రోత్సాహంపైనా ఇరు దేశాల మంత్రులు దృష్టి సారించారు. అలాగే, న్యూజిలాండ్‌ నుంచి చెక్క దుంగలను దిగుమతి చేసుకునే మార్గాలపైనా చర్చించారు. ‘‘యూపీఐ సిస్టమ్‌కు సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ), పేమెంట్‌ ఎన్‌జెడ్‌ మధ్య ప్రాథమిక స్థాయి చర్చలను మంత్రి పీయూష్‌ గోయల్‌తోపాటు న్యూజిలాండ్‌ వాణిజ్య మంత్రి స్వాగతించారు.

ఇరువైపులా దీనిపై చర్చలు కొనసాగించాలని మంత్రులు నిర్ణయించారు’’అని కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2022లో ఫ్రాన్స్‌కు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవ్థ ‘లిక్రా’తో ఎన్‌పీసీఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌కు చెందిన పేనౌతోనూ ఎన్‌పీసీఐ ఈ ఏడాది ఒప్పందం చేసుకుంది. 

పౌర విమానయానంలో పరస్పర సహకారం 
పౌర విమానయాన రంగంలో మరింత సహకారానికి వీలుగా భారత్, న్యూజిలాండ్‌ అవగాహన ఒప్పందానికి వచ్చాయి. మార్గాల షెడ్యూలింగ్, కోడ్‌షేర్‌ సేవలు, ట్రాఫిక్‌ హక్కులు, సామర్థ్య వినియోగంపై సహకరించుకోనున్నాయి. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్‌ భారత్‌లోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ నుంచి ఎన్ని సర్వీసులను అయినా నిర్వహించుకోవచ్చు.

తాజా ఒప్పందం రెండు దేశాల మధ్య పౌర విమానయానంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. అవగాహన ఒప్పందంపై పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్, న్యూజిలాండ్‌ హైకమిషనర్‌ డేవిడ్‌ పైన్‌ సంతకాలు చేశారు.  

మరిన్ని వార్తలు