దేశంలో 5జీ టెక్నాలజీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం!

24 Jan, 2023 09:24 IST|Sakshi

గాంధీనగర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ, 4జీ టెలికం సాంకేతికతలు, సాధనాలు (టెక్నాలజీ స్టాక్‌) ఈ ఏడాది భారత్‌లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వీటిని వచ్చే ఏడాది నుంచి ప్రపంచ దేశాలకు అందించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీ20 కార్యక్రమాల్లో భాగంగా వ్యాపార వర్గాలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన బిజినెస్‌ 20 (బీ20) ప్రారంభ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. 

ఇందులో ప్రభుత్వ వర్గాలు, దిగ్గజ సంస్థల సీఈవోలు తదితరులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో కేవలం అయిదు దేశాల దగ్గర మాత్రమే 4జీ–5జీ టెలికం టెక్నాలజీ స్టాక్‌ ఉండగా, ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారత్‌ సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకుందని మంత్రి చెప్పారు. దీన్ని ఏకకాలంలో 1 కోటి కాల్స్‌పై ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వివరిం చారు. దేశీ టెక్నాలజీతో 2023లో 50,000 –70,000 టవర్లు, సైట్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి వివరించారు. 

ఉత్పత్తి పెంపుపై యాపిల్‌ దృష్టి ..భారత్‌లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు మన దేశాన్ని తమకు కీలక కేంద్రంగా మార్చుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. సంస్థ విక్రయించే ఉత్పత్తుల్లో ప్రస్తుతం 5–7 శాతం భారత్‌లో తయారవుతుండగా దీన్ని 25 శాతం వరకు పెంచుకోవాలని యాపిల్‌ భావిస్తోన్నట్లు తెలుస్తోందని ఆయన వివరించారు.

యాపిల్‌ ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని మోడల్స్‌ భారత్‌లోనే తయారైనవని మంత్రి చెప్పారు. ఎర్త్‌ మూవర్స్‌ మెషీన్‌ రంగానికి చెందిన ఒక విదేశీ కంపెనీ ప్రస్తుతం భారత్‌ నుంచి 110 దేశాలకు తమ ఉత్పత్తులను చౌకగా సరఫరా చేస్తోందని, ఇక్కడి నుంచే కొత్త ఉత్పత్తులను కూడా ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌ వ్యయాలను తగ్గించడంలో, సామర్థ్యాలను పెంచుకోవడంలో, వ్యాపారాలకు ప్రయోజనాలు చేకూర్చడంలోనూ పీఎం గతిశక్తి కార్యక్రమం కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ చెప్పారు. 

అజెండా రూపకల్పనలో బీ20 కీలక పాత్ర..జీ–20 దేశాలు, అలాగే మిగతా ప్రపంచ దేశాలకు మరింత విలువ చేకూర్చే దిశగా అజెండాను రూపొందించడంలో బిజినెస్‌–20 కీలక పాత్ర పోషించగలదని బీ20 ఇండియా చెయిర్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. ఈ వేదికకు భారత్‌ అధ్యక్షత వహించే కాలంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, సృజనాత్మక నైపుణ్యాలు, డిజిటల్‌ పరివర్తన తదితర అంశాల్లో పురోగతికి పలు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, కర్బన ఉద్గారాలరహిత సుస్థిర భవిష్యత్‌ సాధన ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి అభిప్రాయపడ్డారు. 

జీ–20కి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో బీ20 ఇండియా సెక్రటేరియట్‌గా వ్యవహరించేం దుకు సీఐఐ గతేడాది డిసెంబర్‌ 1న ఎంపికైంది. సాధారణంగా బీ20 చెయిర్‌గా జీ20 ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాన్ని జీ20 నియమిస్తుంది. ఈసారి టాటా సన్స్‌ చైర్మన్‌ అయిన ఎన్‌ చంద్రశేఖరన్‌ ఆ బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని వార్తలు